తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట లభించింది. గతంలో సీబీఐ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు సోమవారం (మార్చి 11) స్టే విధించింది. గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి రుణం పొందిన కేసులో కొత్తపల్లి గీత, ఆమె భర్త, మరో ఇద్దరికి సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. సీబీఐ కోర్టు ఆదేశాలపై మాజీ ఎంపీ కొత్తపల్లి గీత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
కొత్తపల్లి గీత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే సీబీఐ కోర్టు ఆదేశాలతో ఆమె పోటీకి అనర్హులు కావచ్చని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్తపల్లి గీతను అనుమతిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.