పసిఫిక్ సముద్రంలో అట్టడుగు భూభాగంపై సువిశాల స్థలంలో వందలాది ఆక్టోపస్‌లు తమ సంతానోత్పత్తిని నిరాఘాటంగా చేస్తున్న దృశ్యాన్ని చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ప్రపంచ దేశాలకు చెందిన 20 మంది శాస్త్రవేత్తలు మూడువారాల అన్వేషణయాత్రలో భాగంగా ఫాల్కర్ అనే నౌకలో కోస్టారికా తీరానికి వచ్చారు. అక్కడి సముద్రంలో 2800 మీటర్ల దిగువ పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లారు. అయితే అనూహ్యంగా అక్కడ ఎకరాలకు ఎకరాల స్థలంలో వందల కొద్దీ ఆక్టోపస్‌లు గుడ్లు పొదిగే పనిలో నిమగ్నమై ఉండటాన్ని గమనించి విస్తుపోయారు. కొన్ని గుడ్లు పొదుగుతుండగా మరికొన్ని పిల్ల ఆక్టోపస్‌లతో ఆడుకుంటున్నాయి.
ఇంత విస్తీర్ణంలో, ఇన్ని ఆక్టోపస్‌లో ఒక కాలనీలా.. లేబర్ వార్డులా… నర్సరీలో తమ సంతానోత్పత్తి ప్రక్రియలో దీక్షగా తలమునకలై ఉండగా చూడటం ఇదే తొలిసారి. తమ యాత్ర, ఆక్టోప్ బ్రూడింగ్ క్లస్టర్ విషయాలను స్కెమిడ్ట్ ఓషన్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డా. జ్యోతిక విరమణి వివరించారు. ఇక్కడ సంతానోత్పత్తి చేస్తున్న ఆక్టోపస్‌లు ముసోక్టోపస్ జాతికి చెందినవి. వీటి పరిమాణం కాస్త చిన్నవిగా ఉంటాయి. మిగతా ఆక్టోపస్‌లకున్నట్లు వీటికి ‘ఇంక్ శాక్స్’ (ప్రమాదంలో చిక్కుక్కున్నప్పుడు నల్లని లేదా విభిన్నమైన రంగులోని ఓ ద్రావకాన్ని వెదజల్లే భాగం) ఉండవు. దీనితోపాటు కాలిఫోర్నియా తీరంలోని మోంటెరె తీరంలోనూ కాస్త చిన్నదైన ఆక్టోపస్ నర్సరీని ఈ బృందం కనుగొంది.
ఇప్పటివరకు వారు మొత్తం నర్సరీలను కనిపెట్టారు. అయితే కోస్టారికాలోని ఆక్టోపస్ నర్సరీ మాత్రం అతిపెద్దది. కెనడాలోని కాల్గరీ వర్శిటీకి చెందిన జియోసైన్స్ ప్రొఫెసర్ డా.రాచెల్ లౌర్ దీనిపై స్పందిస్తూ అక్కడి దృశ్యం చూశాక కళ్లు బైర్లు కమ్మాయని, అక్కడి నర్సరీ అంత పెద్దగా ఉందని, వేలాది చిన్నాపెద్దా ఆక్టోపస్‌లు కనువిందు చేశాయని అన్నారు. సముద్రమంటే ఓ జలభాగంగా చాలామంది భావిస్తారు… కానీ దాని లోపల మరో ప్రపంచం ఉందని, అది ఎంతో విచిత్రంగా, విజ్ఞానదాయకంగా ఉంటుందని యూనివర్శిటీ ద కోస్టారికా బయాలజీ ప్రొఫెసర్ డా.జార్జ్ కోర్టెస్ నునెజ్ అన్నారు.