ధర్మారం (ప్రభ న్యూస్) తెలంగాణలో భూమి మోయలేనంత ధాన్యం పండుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం రాత్రి పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ 2014లో 68 లక్షల ధాన్యం పండితే, గత ఏడాది 2.49 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెరిగి ప్రతి ఎకరానికి సాగునీరు అందడంతో నాలుగింతల ధాన్యం పడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎకరానికి 10వేల రూపాయల చొప్పున రైతుబంధు పథకం ద్వారా రైతులకు అందిస్తున్నామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల కరెంటు అందిస్తున్న దాఖలాలు లేవన్నారు. రైతులను కాల్చి చంపిన చంద్రబాబు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
దొంగ రాత్రి కరెంటు ఇచ్చి రైతుల చావులకు కారణమైన కాంగ్రెస్ కూడా రైతుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. మందు బస్తాలు ఇవ్వలేని కాంగ్రెస్ రైతు సంక్షేమం గురించి మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. బావుల కాడ మీటర్లు పెట్టాలని బిజెపి ఆంక్షలు పెడుతుందన్నారు. మీటర్లు పెట్టకపోవడం వల్ల రాష్ట్రానికి రావలసిన 30 వేల కోట్ల రూపాయలను ఇవ్వడం లేదన్నారు. అయినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గొంతులో ప్రాణం ఉండగా బావుల కాడ మీటర్లు పెట్టమని స్పష్టం చేశారన్నారు. రైతుల ధాన్యం ఆరబోసేందుకు ప్రభుత్వం కల్లాలు పడితే కేంద్రం 150 కోట్లు వాపసు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నదన్నారు. చేపలు ఎండబెట్టడానికి కల్లాలు కట్టడం సరైనదని వాదించే బిజెపి రైతుల ధాన్యం ఆరబోసేందుకు కళ్ళాలు కట్టడం తప్పు అనడం భావ్యం కాదన్నారు. నల్ల చట్టాలు తెచ్చి 750 రైతుల చావుకు కారణమైన బిజెపి రైతుల గురించి మాట్లాడటం మానుకోవాలి అన్నారు. 81 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశిస్తే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇన్ని వేల ఉద్యోగాలు ఇవ్వడం వెనుక కుట్ర దాగి ఉందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎయిర్ ఇండియా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అప్పగించిన కేంద్రం ఎల్ఐసి అమ్మాలని చూస్తున్నదన్నారు.
రామగుండం పర్యటనలో భాగంగా సింగరేణి నియమం అని చెప్పిన మోడీ బొగ్గు బావుల వేలం వేయించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఏడున్నర కోట్ల రూపాయలతో నంది మేడారంలో ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని ఆరు నెలల్లో నిర్మాణం పూర్తయి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ల కోసం పట్టుబట్ట వద్దనే నార్మల్ డెలివరీలు చేయించుకోవాలన్నారు. కెసిఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పదింతలు అయిందన్నారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. రైతన్ననికి కావలసిన సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ముత్యాల బలరాం రెడ్డి, రఘువీర్ సింగ్, రాజేశం, శ్రీకాంత్ రెడ్డి తో పాటు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పాల్గొన్నారు.