హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో పట్టుసాధించి రాబోయే అసెంబ్లి ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని భావిస్తున్న బీజేపీని నాయకత్వ కొరత వేధిస్తోంది. అసెంబ్లి ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో బలమైన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ఎదుర్కొనే సత్తా ఉన్న అభ్యర్థులు లేక ఆ పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటోంది. ఇప్పటికే దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక చేజారిపోవడంతో తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాషాయ అధిష్టానానికి రాష్ట్రంలో నాయకత్వ కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రంలో 119 అసెంబ్లి నియోజకవర్గాలు ఉండగా దాదాపు 30 స్థానాల్లో మాత్రమే అంతో ఇంతో ప్రభావం చూపే నేతలు అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ నిర్వహించిన పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో బలమైన అభ్యర్థులే లేక బీజేపీ సతమవుతోంది. రాష్ట్రంలో 119 అసెంబ్లి నియోజకవర్గాలు ఉండగా అందులో 30 స్థానాల్లోనే బీజేపీకి అభ్యర్థులు ఉన్నారని, మిగతా స్థానాల్లో అభ్యర్థులు కొరత సమస్యగా మారిందని రాష్ట్ర పార్టీ ఇన్చార్జిలు అధిష్టానానికి ఇప్పటికే నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.
అసెంబ్లి ఎన్నికలు ముంచుకొస్తుండడంతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై బీజేపీ ప్రధానంగా దృష్టి ‘సారించింది. అయితే రాష్ట్రంలో బీజేపీ బలాబలాలపై అధిష్టానానికి ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో పార్టీకి రెండోసారి అధికారాన్ని అందించిన సునిల్ భన్సల్ రాష్ట్రంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లి ఎన్నికలకు ఇక ఆరు నెలల సమయమే ఉండడంతో రాష్ట్రంలో పార్టీబలబలాలపై వాస్త వ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయన క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే పార్లమెంటరీ ప్రవాస్ యోజన కింద చేవెళ్ల, నల్గొండ ఎంపీ సెగ్మెంట్లలో ఆయన పర్యటించారు. ఆయా ఎంపీ స్థానాలతోపాటు అక్కడి అసెంబ్లి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్తితి, ప్రజల్లో ఆదరణ, నాయకత్వ సామర్థ్యం తదితర అంశాలపై దృష్టి పెడుతున్నారు.
తదుపరి ఆయన ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని తన పర్యటనల్లో భాగంగా స్థానిక నేతలకు సూచిస్తున్నారు. రానున్న అసెంబ్లి ఎన్నికలనాటికి పార్టీని బలోపేతం చేసే అంశమే ప్రధాన అజెండాగా ఆయన పర్యటనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. బీజేపీకి రాష్ట్రంలో పూర్తిస్థాయిలో బలం లేదన్న అంశాన్ని అమిత్ షాతోపాటు అధిష్టానం నిర్వహించిన పలు సర్వేలు స్పష్టం చేశాయి. అభ్యర్థుల కొరత వేధిస్తున్న తరుణంలో ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను బీజేపీలో చేర్చుకోవాలని భావించిన ఆ పార్టీకి కర్ణాటకలో ఎదురైన ప్రతికూల పరిస్థితులు అడ్డంకిగా మారాయి.
కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ గట్టిగా సంకేతాలు పంపుతుండడంతో ఆయా పార్టీల్లోని అసంతృప్త నేతలు బీజేపీలో చేరికపై వెనుకంజ వేస్తున్నారని బీజేపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. అయితే కొన్ని చోట్ల అసలు అభ్యర్థులే లేక ఇబ్బంది పడుతున్న మరికొన్ని చోట్ల ఒక సీటు కోసమే ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీకి కాస్త పట్టున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదే పరిస్థితి నెలకొంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ సీటుని బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ బీజేపీకి నిదానంగా పట్టు పెరుగుతోంది. ఈ క్రమంలో ఆ జిల్లాలో అసెంబ్లి సీట్ల కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. ఖానాపూర్, ముధోల్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసీఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లి సీట్లలో టికెట్ కోసం పోటీ పడుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది.