రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో.. భారత్ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉందని వస్తున్న వార్తలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఖండించారు. ప్రస్తుతానికి భారతీయ ఆర్థిక వ్యవస్థ ఎంతో బాగుందని స్పష్టం చేశారు. అయితే ఈ యుద్ధం కారణంగా భారతీయ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండదని, ఉన్నా కూడా చాలా స్వల్పంగా ఉంటుందని తేల్చి చెప్పారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌లో భాగంగా.. పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి శక్తికాంత్ దాస్ మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన సమయం కంటే ఇప్పుడు.. భారతీయ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ, ప్రతిష్టంభన ప్రమాదంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో లేదన్న ఆయన.. నిర్ణయించుకున్న లక్ష్యాలను మాత్రమే చూడాలని సూచించారు.
అస్థిరతకు అవకాశం లేదు..
భారతదేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని భావిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పుకొచ్చారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ద్రవ్యోల్బణం దాటే పరిస్థితి లేదని వివరించారు. భారతీయ ఆర్థిక వృద్ధి లక్ష్యంపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటుందన్నారు. కమోడిటీ ధరలపై ముడి చమురుపై ఆధారపడి అంచనాలు వేశామన్నారు. నేటి పరిస్థితి అనిశ్చితంగా ఉందని, భారతదేశంలో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశాలు అన్ని అస్థిరతలతో తలెత్తవని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పుకొచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో.. సరఫరా ఆందోళనల నుంచి చమురు ధరల పెరుగుదలపై కరెంట్ ఖాతాలో లోటును పెంచే ఆందోళనలపై శక్తికాంత్ దాస్ స్పందించారు. కరెంట్ అకౌంట్ లోటును ఫైనాన్సింగ్ చేసే సవాల్‌ను ఎదుర్కోవడానికి భారతదేశం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఎలాంటి ఆర్థికపరమైన సవాళ్లు అయినా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచామన్నారు. లిక్విడిటీపై, సెంట్రల్ బ్యాంక్ గత రెండేళ్లలో రూ.17లక్షల కోట్లను ఇన్‌ఫ్యూజ్ చేసిందని, ఆర్థిక వ్యవస్థకు అవసరమైన తగినన్ని నిధులు అందజేస్తుందని చెప్పుకొచ్చారు.
6.5 శాతానికి ఎన్‌పీఏ
బ్యాంకుల పరిస్థితి కూడా ఎంతో బాగుందని, 16 వద్ద సిస్టమ్-స్థాయి మూలధన సమృద్ధి నిష్పత్తితో బ్యాంకులు బాగా క్యాపిటలైజ్ చేయబడ్డాయని గవర్నర్ శక్తికాంత్ దాస్ వివరించారు. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) రికార్డు స్థాయిలో 6.5 శాతానికి పడిపోయాయని చెప్పుకొచ్చారు. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఎంతో బలంగా ఉందని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు ప్రపంచీకరణ వైపు పరుగులు పెడుతున్నాయని, ఎన్నో ఆటంకాలు కూడా ఎదురవుతున్నాయని, ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం పునరాగమనం చేస్తుందని ఆయన అన్నారు. తాము ఆర్‌బీఐ వద్ద అనేక హై-ఫ్రీక్వెన్సీ సూచికలను పర్యవేక్షిస్తుంటామని, 60 కంటే ఎక్కువ హై ఫ్రీక్వెన్సీ సూచీలు ట్రాక్ చేయబడ్డాయన్నారు. చాలా వరకు గ్రీన్‌లో ఉన్నాయని చెప్పుకొచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..