Friday, November 22, 2024

Big story | పసిడితో పోటీపడుతున్న పసుపు.. క్వింటా15వేలపైనే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఏటా రైతులకు నష్టాలను మిగిల్చిన పసుపు పంట… అనూహ్యంగా కొద్దిరోజులుగా రైతుల పాలిట బంగారంలా మారింది. ఇప్పుడు గ్రాము బంగారం ధర రూ.6వేల చిల్లర ఉండగా పసుపు ధర మాత్రం క్వింటాకు రూ.13 వేల నుంచి రూ.16వేల మధ్య పలుకుతోంది. పసుపు సాగుతో ఏటా కొనేళ్లుగా రైతులు నష్టాలు, కష్టాలతో ఎదుర్కొంటున్నారు. అయితే అనూహ్యంగా కొద్ది రోజులుగా రికార్డుస్థాయిలో వ్యవసాయ మార్కెట్లలో పసుపు ధరలు పెరుగుతుండడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

అంతర్జాతీయంగా పసుపుకు డిమాండ్‌ పెరగడం, రాష్ట్రంలో పసుపు పంట దిగుబడి తగ్గడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజుల వ్యవధిలోనే పసుపు ధర ఊహించని విధంగా అమాంతం పెరిగింది. ప్రస్తుతం పసుపు ధరకు రికార్డు స్థాయిలో ధర పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్‌, ఆదిలాబాద్‌తోపాటు వరంగల్‌లోని ఏనమాములు, కేసముద్రం వ్యవసాయమార్కెట్లలో క్వింటాల్‌ పసుపు ధర రూ. 13 నుంచి రూ.16వేల మధ్య పలుకుతోంది. గడిచిన పదేళ్లలో పసుపు ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో రూ.15005కు క్వింటా పసుపు కొమ్ములు అమ్ముడుపోయాయి.

- Advertisement -

గతంలో క్వింటా పసుపు ధర రూ.6 వేలకు మించి ఎప్పుడూ పలకలేదు. గిట్టుబాటు ధర రాకపోవడంతో గత కొంతకాలంగా రైతులు క్రమంగా పసుపు సాగు తగ్గిస్తూ వస్తున్నారు. పసుపు సాగుచేసిన రైతులు దిగుబడిని మార్కెట్‌ కు తరలించేందుకు చాలావ్యయప్రయాసాలకు ఎదుర్కోవాల్సి వస్తోంది. పసుపు కొమ్ములు తవ్వడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, కొమ్ము వేరు చేయడం, మార్కెట్‌కు తరలించడం ఎంతో వ్యవ ప్రయాసలతో కూడుకున్న పని.

దీంతో పసుపుకు ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు అడుగులు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నట్టుండి రికార్డుస్థాయిలో క్వింటా పసుపు ధర రెండింతలు కావడంతో పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పసుపు ఉత్పత్తి గణనీయంగా ఉంటోంది. పసుపు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణది రెండో స్థానం. రాష్ట్రంలో దాదాపు 330 మెట్రిక్‌ టన్నుల పసుపు ఏటా దిగుబడి అవుతోంది.

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక గతంలో కంటే ఎక్కువగా రాష్ట్రంలో పసుపు ఉత్పత్తి అవుతోంది. 2013-14తో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఏటా ఉమ్మడి రాష్ట్రంలో కంటే దాదాపు 100 టన్నుల పసుపు అధికంగా దిగుబడి అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో పసుపు సాగవుతోంది. ఆ తర్వాత రంగారెడ్డి, వికారాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లోనూ పసుపు సాగవుతోంది. ప్రస్తుతం ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో క్వింటాల్‌ పసుపు ధర రూ. 13 వేలకు చేరింది.

గత పదేళ్లలో పసుపు ధర ఈ స్థాయిలో పలకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపుకు డిమాండ్‌ పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఫార్మా కంపెనీలతోపాటు కాస్మోటిక్స్‌ కంపెనీలు పెద్ద మొత్తంలో పసుపును కొనుగోలు చేస్తుండడం కూడా ధరల పెరుగుదలకు కారణమౖవుతోంది. మరోవైపు దేశీయ మార్కెట్‌లోనూ గృహ అవసరాలకు పసుపు ఉత్పత్తులను అమ్మే కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో పసుపును కొనుగోలు చేస్తున్నాయి.

అయితే ప్రస్తుతం పసుపు ధర క్వింటాల్‌కు రూ.13 వేలు పలుకుతున్నప్పటికీ తమకు వ్యాపారులు రూ.11 వేల వరకే చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌లో పసుపుకు ఇప్పుడు ధర బాగున్నప్పటికీ సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని చెబుతున్నారు. ఇతర పంటల్లాగే పసుపుకు కూడా కేంద్రం మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు అమ్మకానికి తరలించారు. సాగు చేసిన పసుపుకు ఎంత దొరికితే అంతే లాభం అనుకున్నట్లు- అమ్మేసి వచ్చిన పైకంతో తిరిగి వెళ్లారు. వ్యాపారుల చేతికి చేరిన తర్వాత ఒక్కసారిగా రెక్కలు రావడం రైతులకు మాత్రం కొంత ఆనందం మరికొంత విషాదం మిగిల్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement