న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో స్వల్పంగా వరి సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జులై 21 వరకు నమోదైన సాగు విస్తీర్ణం గణాంకాలను కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. గత ఏడాది 175.47 లక్షల హెక్టార్ల నుంచి ఈ ఏడాది 180.20 లక్షల హెక్టార్లకు వరి సాగు పెరిగిందని చెప్పింది. పది లక్షల హెక్టార్ల మేర పప్పుదినుసుల సాగు తగ్గిందని చెప్పింది.
గత ఏడాది కంటే శ్రీ అన్న, చిరు ధాన్యాల సాగు పెరిగిందని వ్యవసాయ శాఖ తెలిపింది. 128.75 లక్షల హెక్టార్ల నుంచి 134.91 లక్షల హెక్టార్లకు శ్రీ అన్న, చిరుధాన్యాల సాగు పెరిగిందని, నూనె గింజల సాగులోనూ 5 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం పెరిగిందని పేర్కొంది. మొత్తంమీద దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగిందని వెల్లడించింది. గత ఏడాది 724.99 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు జరగ్గా, ఈ ఏడాది 733.42 లక్షల హెక్టార్లకు సాగు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.