దేశంలో ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో పెద్దగా పెరగకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ స్థూల ఆర్ధిక పరిస్థితులు అంతకంతకూ క్షీణిస్తుండటం ఇందుకు కారణమని చెబుతున్నారు. ఏడాదిలో చివరి త్రైమాసికం కావడం, డిసెంబర్ సెలవుల నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ రంగాల సంస్థల ఐట బడ్జెట్లు పరిమితంగానే ఉంటాయి. అందువల్ల సాధారనంగానే ఐటీ కంపెనీలకు డిసెంబర్ త్రైమాసికం బలహీనంగానే ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రభావం మన ఐటీ కంపెనీల షేర్ల ధరలపై పడింది. 2023లోనూ ఆయా కంపెనీలు అందించే అదాయ అంచనాలను మదుపర్లు సునిశితంగా పరిశీలిస్తారని చెబుతున్నారు.
అమెరికా, ఐరోపా దేశాల్లోని క్లయింట్లు సాధారణంగా ఈ సమయంలో వార్షిక బడ్జెట్లను సిద్ధం చేసుకుంటారు. ఐటీ కంపెనీలకు ఈ సారి మెరుగ్గా కేటాయింపులు చేయొచ్చని, ఈ నేపథ్యంలో సంస్థల ఆదాయాల్లో వృద్ధి అంచనాలూ బాగుంటాయని కొంత మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గిరాకీ విషయంలో ఐటీ కంపెనీలు మరీ సానుకూలంగా ఏమీ ప్రకటించకపోవచ్చని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.
నియామకాలు, ఆర్డర్లపై దృష్టి
ఔటీ కంపనీల యాజమాన్యాలు చేసే వ్యాఖ్యలనే కాకుండా, నియామకాలు, ఆర్డర్ల ధోరణి కూడా వృద్ధికి సంకేతాలివచ్చని. గత కొన్ని త్రైమాసికాలుగా అంతక్రితం ఏడాదితో పోలిస్తే దిగ్గజ ఐటీ సంస్థలు తమ నియామకాల్లో వేగం తగ్గించాయి. వినియోగ రేటును మెరుగుపరుచుకోవడంతో పాటు, ప్రెషర్ల శిక్షణ పూర్తి కావడమూ ఇందుకు కారణం. గిరాకీ తగ్గుతుందన్న అంచనాలు, ఆర్డర్లు పెద్దగా పెరగకపోవడమూ పని చేశాయి. ఆర్డర్లు మాత్రం ఇటీవల త్రైమాసికాల్లో వచ్చినట్లుగానే భవిష్యత్‌లోనూ కొనసాగవచ్చు. అయితే పెద్దగా పరగపోవచ్చు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) 9-10 బిలియన్ డాలర్ల మేర, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, 2.5 బిలియన్ డాలర్ల చొప్పున మొత్తం కాంట్రాక్ట్ విలువ (టీసీవీ)ను ప్రకటించే అవకాశం ఉంది. ఇక నియామకాలు ఆర్డర్లతో పాటు ఐరోపాపై కంపెనీల వ్యాఖ్యలు కూడా కీలకం కానున్నాయి.
ఆదాయంలో 18 శాతం వృద్ధి
డిసెంబర్ త్రైమాసికంలో ఐటీ కంపెనీల ఆదాయాలు 2021-22 ఇదే మూడు నెలలతో పోలిస్తే 18 మేర, సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 4 శాతం మేర వృద్ధి నమోదు చేసే అవకాశం ఉంది. హెచ్‌సీఎల్ ఆదాయం మాత్రమే జులై-సెప్టెంబర్‌తో పోలిస్తే ఎక్కువ వృద్ధి చెందవచ్చు. మిగిలిన ఏడు ఐటీ కంపెనీల ఆదాయం 7 శాతం వృద్ధి నమోదు చేయొచ్చు. ఈ ఏడు కంపెనీల నికర లాభం 10 శాతం వృద్ధి చెందవచ్చు. హెచ్‌సీఎల్ 13.5-14.5 శాతం, ఇన్ఫోసిస్ 15-16 శాతం తమ పూర్తి ఆర్ధిక సంవత్సర వృద్ధి అంచనాలను కొనసాగించే అవకాశం ఉంది. ఈ రెండూ కూడా అంచనాల గరిష్ట పరిమితిని అందుకోలేకపోవచ్చు.
ఐటీ కంపెనీలు ఆర్ధిక ఫలితాలు టీసీఎస్ ఈ నెల 9తో మొదలు కానున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ ఇన్ఫోసిస్ 12న, విప్రో 13న, పర్సిస్టెంట్ 18న, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ఎంఫిసిస్ 19న ప్రకటించనున్నాయి. టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ తేదీలు ఇంకా నిర్ణయం కాలేదు.