న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎలాంటి అతుకులు లేకుండా, రంగులతో చక్రాన్ని ముద్రించకుండా కేవలం చేనేత ద్వారా ఏకవస్త్ర జాతీయ జెండా రూపొందించిన అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామానికి చెందిన రుద్రాక్షల సత్యనారాయణ ఈ ఘనత సాధించారు. నాలుగేళ్లుగా శ్రమించి జెండా తయారు చేసిన సత్యనారాయణ, చివరకు తన సొంత ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సత్యనారాయణకు ప్రశంసలు వెల్లువెత్తాయి. మాజీ ఐఏఎస్ అధికారి రామచంద్రు తేజావత్, సినీ నటి – చేనేత బ్రాండ్ అంబాసిడర్ పూనమ్ కౌర్ సహకారంతో సత్యనారయణ రాష్ట్రపతిని కలిశారు.
అనంతరం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య స్ఫూర్తితో తాను ఏకవస్త్ర జాతీయ జెండా తయారు చేశానని, ఆ జెండాను ఎర్రకోటపై ఎగరేయాలన్నదే తన అభిమతమని సత్యనారాయణ అన్నారు. దేశంలోనే మొదటిసారిగా అతుకులు లేని జాతీయ జెండా తయారు చేసినట్టు వెల్లడించారు. 8 X 12 సైజులో పెద్ద మగ్గంపై ఆ జెండాను తయారు చేశానని, జాతీయ జెండా మధ్యలో ఉన్న చక్రాన్ని రూపొందించడానికి రెండేళ్లు ఆగిపోవాల్సి వచ్చిందని వివరించారు.
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, చివరకు పూర్తి చేయగలిగానని అన్నారు. తొలుత మొదట్లో రూ. 25 వేలు ఖర్చు పెట్టి 4X6 సైజులో ఏకవస్త్ర జాతీయ జెండా తయారు చేశానని, కానీ ఎర్రకోటపై ఎగరేయాలంటే 8 X 12 సైజులో ఉండాలని తెలిసిందని అన్నారు. ఆ సైజులో తయారు చేసే మగ్గం లేదని, అందుకోసం తొలుత ఇంటిని తాకట్టు పెట్టి జెండా రూపకల్పన మొదలుపెట్టానని చెప్పారు. ఈ జెండాలో జెండా మధ్యలో ఉండే చక్రానికి 24 రేకలకు 2,400 దారాలతో అల్లానని వెల్లడించారు. అయితే జెండా కొంత తయారవగానే మరకలు పడడమో, పాడైపోవడమో జరిగేదని, పట్టు వీడకుండా మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టేవాడినని చెప్పారు. అలా మొత్తంగా 24 ప్రయత్నాల తర్వాత ఈ జెండా తయారైందని అన్నారు. ఇందుకోసం మొత్తం రూ. 6.5 లక్షలు ఖర్చయిందని, ఈ క్రమంలో తాకట్టు పెట్టిన ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చిందని అన్నారు.
ఇతని కథ తెలిసి నిద్రపోలేదు – పూనమ్ కౌర్
ఏకవస్త్ర జాతీయ జెండా తయారు చేస్తున్న సత్యనారాయణ గురించి తెలిసి తనకు కొద్ది రోజులు నిద్రపట్టలేదని సినీ నటి, చేనేత బ్రాండ్ అంబాసిడర్ పూనమ్ కౌర్ అన్నారు. తనకు చేనేత అంటే చాలా ఇష్టమని, ఆ క్రమంలో ఏపీలో చాలా ప్రాంతాలు సందర్శించానని.. అప్పుడే సత్యనారాయణ ఉదతం తనకు తెలిసిందని అన్నారు. చాలా మందిలో భక్తి, దేశభక్తి చూశానని, కానీ జాతీయ జెండా కోసం ఏకంగా ఇంటిని అమ్ముకుని మరీ శ్రమించిన వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని అన్నారు.
తనకు విషయం తెలిసినప్పటి నుంచి వీలైనంత సహాయం చేస్తూ వచ్చానని, ఆ క్రమంలో జెండా తయారయ్యాక తనకు అమ్మమని కోరితే.. తాను ఈ జెండాను ప్రధాన మంత్రికి ఇచ్చి ఎర్రకోట మీద ఎగరేసేందుకు మాత్రమే తయారు చేస్తున్నానని, అమ్మడం కోసం కాదని సత్యనారాయణ చెప్పారని పూనమ్ కౌర్ అన్నారు. ఆ మాట తర్వాత తన కళ్లు చెమర్చాయని అన్నారు.
‘హర్ ఘర్ తిరంగా’ వంటి నినాదాన్ని ఇచ్చి జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ ఎగరేయాలని చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి సత్యనారాయణ కథకు మించింది మరొకటి ఉండదని ఆమె తెలిపారు. సత్యనారాయణను రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లినప్పుడు తమకు ఓ 10 నిమిషాలు సమయం కేటాయిస్తే చాలు అనుకున్నామని, కానీ 35-40 నిమిషాలు తమతో ఆమె గడిపారని, చాలా సంతోషపడ్డారని పూనమ్ కౌర్ తెలిపారు.