హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి : ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్-2023 నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల చేయాలని ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించే హైదరాబాద్ జేఎన్‌టీయూ నిర్ణయించింది. ఎంసెట్‌తోపాటు ఇంజనీరింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించింది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి, జేఎన్‌టీయూ ఉప కులపతి కట్టా నర్సింహారెడ్డి శుక్రవారం ఇక్కడి జేఎన్‌టీయూలో ఈ రెండు ప్రవేశ ప రీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులను మార్చి మూడో తేదీ నుంచి స్వీకరించాలని నిర్ణయించినట్లు వారు చెప్పారు. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 10తేదీ చివరి తేదీగా నిర్ణయించామని, దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఏప్రిల్ 12 నుంచి మూడు రోజులపాటు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.
రూ.250 అపరాద రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తులను ఏప్రిల్ 15 తేదీలోగా అందజేయవచ్చని , రూ.500 రుసుముతో ఏప్రిల్ 20 వరకు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. రూ.2500 అపరాద రుసుముతో ఏప్రిల్ 25తేదీ వరకు దరఖాస్తును చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 30తేదీ నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. మే 7 తేదీ నుంచి అయిదు రోజులపాటు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని, ఇం జనీరింగ్ విభాగంలో మొదటి పరీక్ష మే 7తేదీ మధ్యాహ్నం ప్రారంభమవుతుందని చెప్పారు. మే 8, 9 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ విభాగానికి సంబంధించిన పరీక్ష జరుగుతుంది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రవేశ పరీక్షను మే 10, 11 రెండు రోజులు ఉదయం , మధ్యాహ్నం వేళల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో హైదరాబాద్‌తోసహా నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, గుంటూరులలో పరీక్షా కేంద్రాలుంటాయని తెలిపారు.
ఎంసెట్ దరఖాస్తు ఫీజును ఎస్సీఎస్టీ అభ్యర్థులకు రూ.500. ఇతర అభ్యర్థులు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని , ఒకవేళ విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్ష రాయాలనుకుంటే ఎస్టీఎస్సీ విద్యార్థులు రూ.1000, ఇతర విద్యార్థులు రూ.1800 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇతర వివరాలకు ఎంసెట్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.
28న పీజీఈసెట్ నోటిపికేషన్…
పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ ఈసెట్ నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు లింబాద్రి, కట్టా నర్సింహారెడ్డి ప్రకటించారు. మార్చి నెల 3తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు పీజీ ఈసెట్‌కు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. ఆలస్య రుసుముతో మే 24 వరకు దరఖాస్తులను తీసుకుంటామని, మే 21 నుంచి ఈ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీ ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు.
ఎంసెట్ షెడ్యూల్ ఇదే…
నోటిఫికేషన్ జారీ – ఫిబ్రవరి 28న
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ – మార్చి 3 తేదీ నుంచి
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ( ఎటువంటి అపరాద రుసుము లేకుండా) – ఏప్రిల్ 10
దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు – ఏప్రిల్ 12 నుంచి 14 వరకు
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ – ఏప్రిల్ 30 నుంచి
ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష తేదీలు .. మే 7 నుంచి 9 తేదీ వరకు
అగ్రికల్చర్ మెడిసిన్ పరీక్ష తేదీలు ..మే 10, 11 తేదీల్లో.