Tuesday, November 26, 2024

పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లు.. వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై వివాదాలు, అనుమానాలు, సందేహాలను నివృత్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గురువారం లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ (అనకాపల్లి) బీశెట్టి వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానమిస్తూ ప్రాజెక్టు ఎత్తు, నిర్వాసితులకు చెల్లించిన పరిహారం, కల్పించిన పునరావాసం వివరాలను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్-1 కింద డ్యామ్ ఎత్తు 41.15 మీటర్లు ఉంటుందని, తద్వారా 20,946 కుటుంబాలు ముంపు ప్రభావానికి గురవుతాయని తెలిపారు. వీరికి అందిస్తున్న పరిహారం, పునరావాసం మార్చి 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, కానీ ఇందులో కొంత జాప్యం ఏర్పడిందని వెల్లడించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 11,677 ప్రాజెక్టు ముంపు కుటుంబాలకు పరిహారం, పునరావాసం అందిందని సమాధానంలో పేర్కొన్నారు. ఇకపోతే ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో జరిపిన భూసేకరణ వివరాలను వెల్లడిస్తూ సవరించిన అంచనాల మేరకు ప్రాజెక్టుకు 1,27,263 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని, అందులో ఇప్పటికే 1,13,119 ఎకరాల భూసేకరణ పూర్తయిందని తెలిపారు. మిగతా భూమిని ఈ ఏడాది డిసెంబర్ వరకు పూర్తిచేస్తామని చెప్పారు. ముంపు బాధిత కుటుంబం కింద గుర్తించడానికి ఉన్న నిబంధనలను కూడా ఆయన వివరించారు. మొదటి నోటిఫికేషన్ తేదీ నాటికి 18 ఏళ్లు నిండనివారిని ముంపు బాధిత కుటుంబం కింద పరిగణించడం లేదని, కానీ వారంతా ఇప్పుడు తమను బాధితులుగా గుర్తించాలంటూ వినతి పత్రాలు అందజేస్తున్నారని చెప్పారు.

- Advertisement -

ఎత్తు వివాదం

పోలవరం ప్రాజెక్టులో డ్యామ్ ఎత్తును 41.15 మీటర్ల నుంచి 38.05 మీటర్లకు తగ్గిస్తారంటూ గతంలో చర్చ జరిగింది. ఎత్తు తగ్గించడం ద్వారా ముంపు ప్రభావిత ప్రాంతం కూడా తగ్గుతుందని, తద్వారా భూసేకరణ చేపట్టాల్సిన ప్రాంతం గణనీయంగా తగ్గి కేంద్ర ప్రభుత్వంపై పరిహారం, పునరావాసం ప్యాకేజి కింద అయ్యే ఖర్చు తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కథనాలు వచ్చాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సైతం డ్యామ్ ఎత్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఎత్తును తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

ఈ విషయంపై సుప్రీంకోర్టులో వివాదం కూడా కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో పోలవరం డ్యామ్ ఎత్తు ఎంత ఉంటుందన్న విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. తొలిదశలో అనుకున్న విధంగా 41.15 మీటర్లు ఉంటుందని తేల్చిచెప్పింది. అయితే ప్రాజెక్టు మొత్తం ఎత్తు 45.7 మీటర్లు ఉండాల్సి ఉండగా, కేంద్రం 41.15 మీటర్లేనని తేల్చి చెప్పిందని, తద్వారా ఎత్తును పరిమితం చేసిందని ప్రచారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం తొలిదశలో ఎత్తు 41.15 మీటర్లు అని చెప్పింది. ఆ తర్వాతి దశలో ఎత్తును పెంచుకునే వెసులుబాటు కల్పించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement