ములుగు ప్రతినిధి (ప్రభ న్యూస్): ములుగు జిల్లాలో నాలుగు రోజులుగా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లా కేంద్రం వరదలతో అతలాకుతలమవుతోంది. భారీ వర్షలకు ములుగు జరదిగ్బంధంలో మునిగిపోయింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని మహర్షి కళాశాల ఎదుట రోడ్డు నీట మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా నీరు నిలిచిపోవడంతో ములుగు ఈవో ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది వరద నీటిని కాలువలోకి మళ్ళించారు.
అలాగే ప్రేమ్ నగర్ సమీపంలో జాతీయ రహదారి పూర్తిగా నీట మునిగిపోయింది. కోర్టు సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఇళ్ళ లోకి నీరు ప్రవేశించింది. ములుగు సమీపంలోని జీవంతరావుపల్లి, పాలసావుపల్లి గ్రామాలలో కొన్ని వీధులలో ఇళ్ళ లోకి నీరు చేరింది. దీంతో నీట మునిగిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గ్రామపంచాయతీ ఈవో చర్యలు తీసుకుంటున్నారు.