న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వాటాల పంపకం కోసం కృష్ణా ట్రిబ్యునల్ – 2 (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్)కు బాధ్యత అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై అభిప్రాయం చెప్పాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. తాజా నోటిఫికేషన్ మేరకు బుధవారం విచారణ ప్రారంభించిన ట్రిబ్యునల్ తదుపరి నవంబర్ 22, 23 తేదీల్లో విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది.
నవంబర్ 15లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈనెల 6న కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు ట్రిబ్యునల్-2 కు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి వాటాలు తేల్చే పనిని అప్పగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
అనంతరం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాలపై విచారణాంశాలను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ట్రిబ్యునల్ తొలిసారిగా బుధవారం సమావేశమై విచారణ చేపట్టింది. అయితే కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ పై అధ్యయనం చేయాల్సి ఉందని, సమగ్రంగా అధ్యయనం చేసేందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిని వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం.. తక్షణమే విచారణ చేపట్టాలని ట్రిబ్యునల్‌ను కోరింది. అయితే ట్రిబ్యునల్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ట్రిబ్యునల్, తదుపరి విచారణ నవంబర్ 22, 23 తేదీల్లో చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఇదిలా ఉంటే, కృష్ణా ట్రిబ్యునల్-2కు అనదపు బాధ్యతలు అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుబడుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
నదీ జల వివాదాల చట్టం ప్రకారం బ్రిజేషన్ కుమార్ ట్రిబ్యునల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించే అధికారం లేదని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉందని, విభజన చట్టం సెక్షన్ 89(ఏ) – 89(బీ) కింద ట్రిబ్యునల్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశం ఇప్పటికే పరిశీలనలో ఉందని గుర్తుచేసింది. ఇప్పుడు కొత్త అంశాలు చేర్చి వాటాలు పంచాలని సూచించడం సరికాదని తెలిపింది. కృష్ణా ట్రిబ్యునల్-2కు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.