కోవిడ్ దేశంలో స్పష్టమైన విభజన తీసుకు వచ్చింది. దేశ ప్రజల్లో ధనికులు మరింత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. పేదలు ఇంకా కోవిడ్ ప్రభావం నుంచి కోలుకోలేకపోతున్నారు. వీరు మరింత పేదరికంలోకి జారి పోతున్నారు. దీని ప్రభావం వినియోగదారుల మార్కెట్ శైలిపై కూడా పడింది. ఏదైనా కొనుగోలు చేసేందుకు పేద, మధ్య తరగి వారు ఇంకా ధైర్యంగా ఖర్చు చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. అదే సమయంలో దేశంలోని ధనిక వర్గం మాత్రం తమకు నచ్చిన వాటిని హై ఎండ్, లగ్జరీ వస్తువులను ఎంత ఖరీదైనా కొనుగోలు చేసేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఇటీవల విడుదల చేసిన పలు డేటాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. టూ వీలర్స్ రూరల్ సేల్స్ 16 శాతం పడిపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మార్కెట్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అశాజనంగా లేదు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రానున్న త్రైమాసికాల్లో పరిస్థితి మెరగువుతుందని ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. అదే స మయంలో దేశంలో ధని వర్గాలు లగ్జరీ కార్లు, విలావంతమై నివాస గృహాల, అత్యంత ఖరీదైన వాచీలు ఇలా తమకు నచ్చిన లగ్జరీ వస్తువులను భారీగా కొనుగోలు చేస్తున్నారు. వీటి అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి.
పేద మధ్య తరగతివారు….
పీడబ్ల్యూసీ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో పేదలు, మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న జీవన వ్యయంతో అనవసర ఖర్చులు తగ్గించుకుంటున్నారు. దేశంలోని వినియోగదారుల్లో 63 శాతం మంది తమకు అవసరంలేని వాటిపై, ఇతర సేలవపై ఖర్చును తగ్గించుకుంటున్నారని సర్వేలో తేలింది. సర్వేలో పాల్గ్గొన్న వారిలో 74 శాతం మంది తమ వ్యక్తిగత ఆర్ధిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. కోవిడ్ తరువాత గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు చాలా వరకు తగ్గాయి. అదే సమయంలో సంపన్న వర్గాలు నుంచి కొనుగోళ్లు పెరిగాయి. కోవిడ్ సమయంలో పేద, మధ్య తరగతి ఆదాయాలకు భారీగా గండిపడింది. దీని ప్రభావంతో ఈ వర్గాలు వారు ఎక్కువ ఖర్చు చేయకుండా, మరింత పొదుపు చేయాలని భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారు స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో సరైన షాపింగ్ చేయలేకపోయిన ధని వర్గం మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో చెలరేగిపోతున్నది. షాపింగ్ పై భారీగా ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.
లగ్జరీ డిమాండ్ పెరుగుదల..
ఇండియా సోత్‌బైస్ ఇంటర్నేషనల్ రియాల్టి (ఇండియా ఎస్‌ఐఆర్) ప్రకారం 2023లో స్థూల ప్రాపర్టీ సేల్ టర్నోవర్ 2022 కంటే 50 శాతం పెరుగుదలను నమోదు చేసింది. లగ్జరీ రెసిడెన్షియల్ అమ్మకాలు, పెద్ద క్యాపిటల్ మార్కెట్ ప్రాపర్టీ లావాదేవీలలో ప్రత్యేకత కలిగిన సంస్థ. దాని ప్రాపర్టీ ఇన్వెంటరీని 30 శాతం కంటే ఎక్కువ పెంచుకుంది. ఎస్‌ఐఆర్ సంస్థ 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఇండియా, శ్రీలంక, మాల్ధివుల్లో రియాల్టిలో 1 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరపాలని లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ ఎండీ అమిత్ గోయల్ చెప్పారు. 2021లో ఈ కంపెనీ 280 మిలియన్ డాలర్ల విలువైన 182 లగ్జరీ ప్రాపర్టీస్‌ను విక్రయించింది. 2022లో 190 మిలియన్ డాలర్ల విలువైన 102 ప్రాపర్టీలను విక్రయించింది. 2022లో కంపెనీ మొత్తం అమ్మకాలు 300 మిలియన్ డాలర్లుగా ఉంది.
ఢిల్లిలోని అత్యంత ఖరీదైన రోలెక్స్ వాచ్ షోరూమ్‌లో ఆర్డర్‌కు తగిన విధంగా సప్లయ్ చేయలేకపోతున్నట్లు షోరూమ్ ప్రతినిధి తెలిపారు. లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కూడా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రికార్డ్ స్థాయి సేల్స్‌ను నమోదు చేసింది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి భారీగా ఆర్డర్ బుక్ ఉన్నట్లు తెలిపింది. భారత్‌లో ఉన్న ధనికులు, బిలియనీర్లు ఉత్పత్తులపై భారీగా ఖర్చు చేస్తున్నారు. కార్లు, వాచీలు, హ్యాండ్ బ్యాగ్‌లపై లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరో వైపు అత్యంత విలాసవంతమైన నివాస గృహాలను వందల కోట్లతో కొనుగోలు చేస్తున్నారు. దేశంలో ఈక్విటీలు, బంగారంపై భారీ పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య 16 శాతం పెరిగిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది.
దేశంలో ధినికులు, కుబేరులతో పాటు, ఎగువ మధ్య తరగతికి చెందిన వారు తమకు కావాల్సిన వస్తువుల కొనుగోలుపై భారీగానే ఖర్చు చేస్తున్నారు. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్లు, లగ్జరీ బూట్ల కొనుగోలు ఎక్కువ చేస్తున్నారు. వీటి అమ్మకాలు 2022-23లో 18 శాతం పెరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే వీటి ధరలు కూడా పెరిగాయి.
పర్సనల్ కేర్ ఉత్పత్తుల అమ్మకాలు చూస్తే 50 రూపాయల కంటే తక్కువ ధర ఉన్న ప్యాక్ అమ్మకాలు 6.8 శాతం తగ్గాయి. అదే సమయంలో 50-200 రూపాయల వరకు ఉన్న వాటి అమ్మకాలు 2.7 శాతం, 200 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న వాటి అమ్మకాలు 4.1 శాతం పెరిగాయి. కోవిడ్ కాలంలో తీవ్రంగా దెబ్బతిన్న ఎఫ్‌ఎంసీజీ గూడ్స్ అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి గ్రామీణ మార్కెట్లలోనూ అమ్మకాలు పెరుగుతాయని ఈ కంపెనీలతో పాటు, టూ వీలర్ మోటార్ కంపెనీలు కూడా విశ్వాసంతో ఉన్నాయి.