అగ్రరాజ్యం అమెరికా, చమురుదేశం సౌదీ మధ్య రోజురోజుకి సంబంధాలు క్షీణిస్తున్న సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఇటీవల ఒపెక్ దేశాల నిర్ణయం ఇరుదేశాల దౌత్యసంబంధాలపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. చమురు ఉత్పత్తిలో కోత విధించాలని ఒపెక్ దేశాలు ఈమధ్య తీర్మానించాయి. ఈ క్రమంలో సౌదీతో సంబంధాలను పునస్సమీక్షించాలని నిర్ణయించినట్లు శ్వేతసౌధం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ విషయంలో అధ్యక్షుడు బిడెన్ స్పష్టతతో ఉన్నారని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కెర్బీ వ్యాఖ్యానించారు. సౌదీ సంబంధాల గురించి బిడెన్ కూడా కాంగ్రెస్‌లో చర్చించే అవకాశం ఉందని సమాచారం. అగ్రరాజ్యం తరఫున సౌదీ అరేబియాకు లభించే సహాయ సహకారాలు నిలిపివేయాలని సెనెట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ బాబ్ మెనెండెజ్ సూచించారు. సైనిక, భద్రత సహకారాలు ఆపివేయాలన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ తన వైఖరి మార్చుకునే వరకు ఎటువంటి సహకారానికి అంగీకరించను అని చెప్పారు.