న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 27న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ కేసు విచారణ త్వరగా చేపట్టాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బెంచ్ ఎదుట ప్రస్తావించారు. ఈ వారంతో పాటు వచ్చే వారాంతం వరకు విచారణ జరపాల్సిన కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఈ సందర్భంగా మార్చి 27తో మొదలయ్యే వారంలో కేసు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
ముఖ్యమైన బిల్లులను నెలల తరబడి ఆమోదించకుండా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తన వద్దే పెండింగులో పెట్టుకున్నారని, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా గవర్నర్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను త్వరగా విచారణకు స్వీకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.