ఆడబిడ్డలపై అత్యాచారాలను నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా అటువంటి ఆలోచనలే మృగాళ్లకు రాకుండా సంస్కరణలు తీసుకురావలసిన బాధ్యత చట్టసభ సభ్యులు, మేధావులు, సంఘసంస్కర్తలపై ఎంతగానో ఉందని కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న అమానుష సంఘటనలు మరోసారి హెచ్చరిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో తరచూ అత్యాచార ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఇటీవల శంషాబాద్ పరిసరాల్లో జరిగిన ‘దిశ’ హత్యాచార ఘటన మరువక ముందే, ఈ వారంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన పదిహేడేళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం తీవ్రంగా మనసును కలచివేసిందన్నారు. కొందరు మైనర్ బాలురు వారు ప్రయాణిస్తున్న కారులోనే అత్యాచారానికి పాల్పడటం మాటలకందని దుర్మార్గమన్నారు. అల్లారుముద్దుగా పెంచుకునే బిడ్డలపై పరులెవ్వరైనా ఒక దెబ్బ వేస్తేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారని, ఆవేదనకు గురవుతారని, అటువంటిది ఒక సమూహమే ఆ బాలికను చెరపడితే ఆ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయివుంటారో, ఎంత క్షోభకు గురై ఉంటారో ఊహించగలనన్నారు. అటువంటి దారుణ పరిస్థితి పగవారికి సైతం రాకూడదని కోరుకునే భారతీయ సమాజం మనదని పవన్ అన్నారు.
అటువంటి సమాజం నుంచి వచ్చిన మన బిడ్డలు రాక్షసులుగా మారి ఇటువంటి నీచాలకు పాల్పడడం ఉపేక్షించడానికి వీలు లేని ఘోరమని వ్యాఖ్యానించారు. ఈ కేసులో పోలీసుల పరిశోధన చురుగ్గా సాగుతున్నప్పటికీ దోషులలో ఏ ఒక్కరు తప్పించుకోకుండా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముద్దాయిలు చిన్నవారైనా, పెద్దవారైనా, పలుకుబడి ఉన్నవారైనా పట్టి చట్టం ముందు నిలబెట్టాలన్నారు. దోషులకు శిక్ష పడినంత మాత్రాన అత్యాచారానికి బలైన ఆ బాలికకుగాని, ఆమె కుటుంబానికిగాని న్యాయం జరిగిందని భావించకూడదన్నారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. దోషుల కుటుంబాల నుంచి భారీగా నష్టపరిహారం రాబట్టి బాధితురాలికి అందజేయాలన్నారు. ఆమె నిలదొక్కుకుని సామాన్య జీవితం కొనసాగించడానికి తెలంగాణ మంత్రి, నవతరం నాయకులు కేటీ రామారావు (కేటీఆర్) చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.