హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీపీ, షుగర్ పేషెంట్లకు ఇంటివద్దకే ఉచితంగా మందులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టు కింద సిద్ధిపేట జిల్లాలో సత్ఫలితాలనిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే వరంగల్, రాజన్నసిరిసిల్ల ఉమ్మడి పాలమూరులోని ఒకటి రెండు జిల్లాల్లో ఇంటి వద్దకే ఉచిత బీపీ, షుగర్ మందుల కిట్లు పంపిణీ అవుతున్నాయి. ఈ పథకం కింద ప్రతి నెలకు సరిపడా మందులను తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా రోగుల ఇండ్ల వద్దకే చేరుస్తుంది. ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసి ఆ తర్వాత మందులు పంపిణీ చేస్తారు.
పూర్వం ప్రతి వెయ్యి మందిలో ఒకరిద్దరికి రక్తపోటు, మధుమేహం ప్రధాన ఆరోగ్య సమస్యలుగా ఉండేవి. మారిన జీవన విధానంతో ఇప్పుడు ప్రతి పది మందిలో ముగ్గురు, నలుగురు బీపీ, షుగర్ వ్యాధిగ్రస్థులు ఉంటున్నారు. బీపీ, షుగర్ చిన్న వ్యాధులుగానే కనిపించినా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు తెస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కర్రకు చెదలు పడితే ఎలానో బీపీ, షుగర్ వ్యాధులు సోకితే శరీరంలోని అవయవాలు క్రమంగా దెబ్బతింటాయని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి ఉందని గుర్తించకపోయినా, గుర్తించాక తగిన మందులు వాడకపోయినా ప్రాణాలను అంతం చేసేంత ప్రమాదకరమైన వ్యాధులు బీపీ, షుగర్. కొవిడ్ అనంతరం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బీపీ, షుగర్ వ్యాధిగ్రస్థులకు ఇంటి వద్దకే నెల నెలా మందులను అందిస్తోంది.
నెలకు సరిపడా బీపీ, షుగర్ మం దులను ఇవ్వడంతోపాటు వాటిని ఎప్పుడు ఎలా వేసుకోవాలో తెలిసేలా ప్రత్యేక పౌచ్‌లలో ఉంచి పంపిణీ చేస్తున్నారు. దీంతో వ్యాధిగ్రస్థులు తప్పకుండా మందులు వేసుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా ఆశా కార్యకర్తలు బీపీ, షుగర్ పేషెంట్లకు మందులు పంపిణీ చేయడంతోపాటు వారు వాటిని క్రమం తప్పకకుండా వేసుకుంటున్నారా..? లేదా..? కూడా పరిశీలించనున్నారు. రోగులకు నెలనెలా బీపీ, షుగర్ టెస్టులు చేసి వాటి ఆధారంగా వ్యాధి తీవ్రతను అంచనా వేసి తదుపరి వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తారు.