హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గతంతో పోలిస్తే సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయనీ, అయితే ఐదేండ్లకు ఒకసారి డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. దొమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామాల స్థాయిలో ర్యాపిడ్ కిట్లు, పట్టణాల స్థాయిలో ఆర్టీపీసీఆర్ టెస్టుల కిట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రజలు కాచి వడబోసిన నీటినే తాగాలని సూచించారు. డెంగ్యూ కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో ఎక్కువగా ఉంటున్నందున మేడ్చల్ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవమున్న ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ శ్వేతా మహంతిని ప్రత్యేకాధికారిగా నియమించినట్లు తెలిపారు. దోమతెరలను ప్రభుత్వం పంపిణీ చేసిందని, వాటిని వాడేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్ల అనుసంధాన పునరుద్ధరణ కోసం రోడ్లు, భవనాల శాఖకు రూ.10 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.10 కోట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు.
హస్టళ్లను కలెక్టర్లు తనిఖీ చేయాలి…
ప్రభుత్వ సంక్షేమ వసతి హాస్టళ్లో తరచూ నీటి కాలుష్యం, ఆహార కాలుష్యంతో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు విధిగా ఆయా హాస్టళ్లను సందర్శించి ఆహారం, నీటిని తనిఖీ చేయాలని ఆదేశించారు. గురుకులాల్లో నాణ్యతలేని బియ్యం ఉంటే వెంటనే వెనక్కి తీసుకుని నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం విద్యాసంస్థలు, పాఠశాల్లో డ్రైడే పాటించేలా చర్యలు చేపట్టాలి. ప్రతి ఆదివారం ఇళ్లలో డ్రైడే పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.
ఇంటింటికి బూస్టర్ డోస్…
వచ్చే నెల రోజుల పాటు ఇంటింటికి కరోనా బూస్టర్ ఇవ్వనున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అన్ని విద్యాసంస్థల్లో బూస్టర్ డోసు వేసే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా బూస్టర్ డోసు వేసుకోవాలని ఆయన కోరారు.
మంకీ పాక్స్ ఫలితాలు నేడు లేదా రేపు…
మంకీ పాక్స్ లక్షణాలు ఉన్న ఇబ్రహీం ఈ నెల 6వ తేదీన కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. 20వ తేదీ నుంచి జ్వరం, మొహం, చేతులపై మచ్చలు వంటి మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అతన్ని ఫీవర్ ఆస్పత్రిలో ఇప్పటికే ఉంచి చికిత్స ఇస్తున్నామన్నారు. అతని నమూనాలను సేకరించి గాంధీ ఆస్పత్రితో పాటు జాతీయ నోడల్ సెంటర్ పుణలోని ల్యాబ్‌కు కూడా పంపించినట్టు వెల్లడించారు. అతనితో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులను ట్రేస్ చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఉడకబెట్టని మాంసం, మంకీపాక్స్ సోకిన వ్యక్తి శరీరద్రవ్యాలు, వాడిన వస్త్రాలను ఇతరులు వేసుకోవడం ద్వారా ఈ వ్యాధి విస్తరించే అవకాశం ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లోనే పరీక్షలు నిర్వహించాలని హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఎంఐడీసీ ద్వారా మంకీపాక్స్ పరీక్షల కిట్లను సేకరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ నిల్వ ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఒకవేళ అలాంటి కొరత ఉంటే తీర్చేందుకు ప్రయత్నిస్తామని హరీష్ రావు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.