హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పురపాలన మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మునిసిపాలిటీల్లో క్షేత్రస్థాయిలో పనిచేసేందుకుగాను త్వరలో వార్డు ఆఫీసర్ల నియామకం జరగనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా అనుమతిచ్చిన 9వేల పై చిలుకు పోస్టుల్లో 1862 వరకు వార్డు ఆఫీసర్ల పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఆర్థిక శాఖ అనుమతి వచ్చిన తర్వాత పోస్టుల భర్తీ వేగవంతమవుతుందని పురపాలక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
గ్రూప్-4లో భాగంగా వార్డు ఆఫీసర్ల నియామకం పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్‌లలో జనాభాను బట్టి వార్డుకు ఒకరు లేదా వార్డుకు ఇద్దరు ఆఫీసర్లను నియమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 50 వేల జనాభా వరకు ఉన్న మునిసిపాలిటీ అయితే వార్డుకు ఒకరు 50 వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న వార్డయితే వార్డుకు ఇద్దరు చొప్పున వార్డు ఆఫీసర్లను నియమించనున్నట్లు పురపాలక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
క్షేత్రస్థాయికి పట్టణ ప్రగతి ఫలాలు…
గ్రూప్-4లో భాగంగా వార్డు ఆఫీసర్లు నియామకమైన తర్వాత మునిసిపాలిటీల్లో వార్డుస్థాయిలో పాలన మెరుగుపడనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలు మరింత ప్రభావవంతంగా క్షేత్రస్థాయిలో అమలు చేయడం వీలవనుంది. వార్డు ఆఫీసర్లు పట్టణ ప్రగతి కార్యక్రమ ఫలాలను మునిసిపాలిటీల్లోని ప్రతి వాడకు ప్రతి ఇంటికి ప్రతి పౌరునికి అందేలా పనిచేసేలా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. గతంలో ఒకేసారి 9 వేల మంది పంచాయతీ కార్యదర్శులను ఏకబిగిన నియమాకం జరిపిన ప్రభుత్వం రాష్ట్రంలోని పల్లెల్లో వారిని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటోంది. వీరి ద్వారా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ గ్రామ పంచాయతీల పాలను ఆదర్శంగా నిలిపింది.
ఇదే బాటలో రాష్ట్రంలోని పట్టణాల్లో పురపాలనను కొత్త పుంతలు తొక్కించేందుకు వార్డు ఆఫీసర్ల నియామకం నాంది పలకనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్, పచ్చదనం కేటగిరీల్లో దూసుకుపోతున్న మునిసిపాలిటీలు వార్డు ఆఫీసర్ల నియామకం జరిగి పాలన కొత్త పుంతలు తొక్కిన తర్వాత దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచి మరిన్ని అవార్డులు గెలుచుకోవడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.