Tuesday, November 26, 2024

రాళ్లపాడుకు వెలిగొండ నీళ్లు.. 1.17 టీఎంసీలు కేటాయించిన ప్రభుత్వం

అమరావతి, ఆంధ్రప్రభ : రాళ్లపాడు ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందనున్నాయి. వెలిగొండ నుంచి 1.17 టీ-ఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమశిల ఉత్తర కాలువ ద్వారా రాళ్లపాడుకు చేరుతున్న 1.5 టీఎంసీల పెన్నా జలాలకు ఇపుడు కృష్ణా నీళ్ళు తోడవుతున్నాయి. పెన్నా, కృష్ణా జలాలు కలుపుకుని మొత్తం 2.67 టీఎంసీల నీరు రాళ్లపాడు ప్రాజెక్టుకు చేరనుంది. 1.17 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించటమే కాకుండా ఆయకట్టు పరిధి పెరిగేలా ఎడమకాలువను పొడిగించేందుకు ప్రభుత్వం రూ 27 కోట్లను కేటాయించింది. 1.1 టీఎంసీల నీటి నిల్వ సామర్దంతో వర్షాధార ప్రాజెక్టుగా నిర్మించిన రాళ్ళపాడు కుడి, ఎడమ కాల్వల కింద గతంలో ప్రకాశం జిల్లా పరిధిలో ఉండి జిల్లాల పునర్విభజన అనంతరం నెల్లూరులో కలిసిన లింగసముద్రం, గుడ్లూరు, వలేటివారిపాలెంతో పాటు నెల్లూరు జిల్లాలోనే కలిసి ఉన్న కొండాపురం మండలాల్లో అధికారికంగా, అనధికారికంగా 20 నుంచి 25 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

వెలిగొండ జలాలు వచ్చిన అనంతరం ఆయకట్టు- 40 వేల ఎకరాలకు పెరుగుతుందని అంచనా. సుమారు 30 గ్రామాలు తాగునీటి కోసం ఈ ప్రాజెక్టు మీదే అధారపడతాయి. వర్షాధార ప్రాజెక్టుగా నిర్మించటం వరుణుడు పూర్తిస్థాయిలో కరుణిస్తే తప్ప జలాశయం నిండే పరిస్థితులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కింద సాగు, తాగునీటి కొరత ఎదుర్కొంటు-న్న వారి విజ్ఞప్తుల మేరకు సోమశిల నుంచి గతంలో 1.5 టీఎంసీల పెన్నా జలాలను కేటాయించటంతో కొంత ఊరట కలిగింది. ఇపుడు కృష్ణా జిలాలను కేటాయించటంతో రైతులతో పాటు- తాగునీటి కోసం ప్రాజెక్టుపై ఆధారపడిన సుమారు 30 గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో టెండర్లు..
వెలిగొండ నుంచి రాళ్లపాడుకు నీటిని తరలించే పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. వెలిగొండ నుంచి ఉదయగిరికి నీటిని తరలించే ఈస్ట్రన్‌ మెయిన్‌ కెనాల్‌ ద్వారా రాళ్లపాడుకు నీటిని తరలించాలనేది ప్రతిపాదన. మెయిన్‌ కెనాల్‌ కూ, రాళ్లపాడుకు మధ్య దూరం 57 కిలోమీటర్లు ఉండగా కేవలం 4 కిలోమీటర్ల కాల్వ తవ్వటం ద్వారా నీటిని తరలించే అవకాశం ఉంది..ఉప్పువాగు నుంచి నక్కలగండి చెరువుకూ..అక్కడ నుంచి మన్నేరు ద్వారా నీటిని మళ్లించి రాళ్లపాడుకు తరలించాలని జలవనరుల శాఖ అధికారుల ప్రణాళిక సిద్ధం చేశారు.ఈమేరకు త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement