Tuesday, November 19, 2024

సర్కారు కొలువే లక్ష్యం.. శిక్షణ కేంద్రాల బాటపడుతున్న యువత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇది ఉద్యోగనామ సంవత్సరం. నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చిపెట్టే సంవత్సరం. రాష్ట్రంలో ఉద్యోగాల జాతర జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ప్రకటించినట్లుగానే గతేడాది చివరలో భారీగా నోటిఫికేషన్లను వేసింది. గ్రూప్‌-1, 2, 3, 4, పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై, స్టాఫ్‌ నర్స్‌, ఎంఏయూడీ, అకౌంట్స్‌, అగ్రికల్చర్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఏఎంవీఐ, బీఐఈ, లైబ్రేరియన్‌, జూనియర్‌ లెక్చరర్లు, హాస్టల్‌ వెల్ఫేర్‌ తదితర నోటిఫికేషన్లు ఇప్పటికే వెలువడ్డాయి. మరికొన్ని త్వరలో వెలువడనున్నాయి. అయితే ఇందులో గ్రూప్‌-1, పోలీస్‌ ఉద్యోగాల భర్తికి ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మిగిలినవాటికి దరఖాస్తు ప్రక్రియ నడుస్తోంది.

దీంతో ప్రభుత్వ ఉద్యోగాలపై యుత దృష్టి సారించింది. ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది. ప్రణాళికలు రూపొందించుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ఏర్పర్చుకున్న గ్రామీణ ప్రాంత యువత పట్టణాల బాటపడుతున్నారు హైదరాబాద్‌, వరంగల్‌ వంటి పట్టణాల్లో శిక్షణా కేంద్రాల్లో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది యువతి, యువకులు కోచింగ్‌ కేంద్రాల్లో చేరారు. పోలీస్‌ ఉద్యోగాలు, గ్రూప్‌-2, 3, 4, జూనియర్‌ లెక్చరర్లు తదితర ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నవారు ఎక్కువగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే తమ కలల కొలువును సాకారం చేసుకునేందుకు కోచింగ్‌ సెంటర్లకు యువత క్యూ కడుతున్నారు. మరోవైపు ఇప్పటికే సర్కారు కొలువున్న ఉద్యోగులు సైతం గ్రూప్‌-2 లాంటి ఉద్యోగాల కోసం సెలవులు పెట్టి ప్రిపేర్‌ అవుతున్నారు.

రాష్ట్రంలో 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవడంతో, అంతే వేగంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సైతం ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నారు. ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఇతర జిల్లాలకు చెందిన అభ్యర్థులంతా హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకునేందుకు నగరానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌తోపాటు ఇతర కొన్ని జిల్లా కేంద్రాల్లోనూ గ్రూప్స్‌, పోలీస్‌, టీచర్స్‌, హెల్త్‌, పంచాయతీరాజ్‌ సెక్రటరీ, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్‌ సెంటర్లు ఉన్నాయి. కానీ హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు ఇచ్చే శిక్షణ ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ మెరుగ్గా ఉంటుందనే అభిప్రాయంతో వేలాది మంది యువత నగర బాట పడుతున్నారు. ఇక్కడ ఉత్తమ ఫ్యాకల్టి, డైలీ టెస్టుల నిర్వహణ, స్టడీ మెటీరియల్‌, హాస్టల్‌ వసతి బాగుంటాయనే కారణాలతో వేలల్లో ఫీజులను చెల్లించి హైదరాబాద్‌ కోచింగ్‌ కేంద్రాల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

- Advertisement -

ఈసారి పోటీ ఎక్కువే…

ఎన్నాళ్లనుంచో యువత ఎదురు చూస్తున్న గ్రూప్‌-1, 2, 3, 4 నోటిఫికేషన్లు, జూనియర్‌ లెక్చరర్లు, పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు పడడంతో తీవ్ర పోటీ నెలకొంది. గ్రూప్‌-2, 3, 4 పరీక్షలు రాసే ఉద్యోగార్థులు ఎక్కువగా ఉంటారు. దీంతో ఒక్కో పోస్టుకు పదుల సంఖ్యలో పోటీ ఉండనుంది. టీఎస్‌పీఎస్‌సీలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. దాదాపు 22కు పైగా నోటిఫికేషన్లు రాష్ట్రంలో వెలువడ్డాయి. కొన్ని నోటిఫికేషన్లకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయితే మరికొన్ని నోటిఫికేషన్లకు ఒకట్రెండు రోజుల్లో, మరికొన్నింటికి వారం పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. గ్రూప్‌-4 దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 30 నుంచి ప్రారంభంకాగా ఇప్పటి వరకు 2,48,955 దరఖాస్తు అందినట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.

గ్రూప్‌-2 దరఖాస్తు ప్రక్రియ ఈనెల 18 నుంచి, గ్రూప్‌-3 ఈనెల 24 నుంచి ప్రారంభం కానుంది. అర్హతలకు అనుగుణంగా అభ్యర్థులు వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనున్నారు. ఒక్క ఏడాదిలో ఇన్నేసి నోటిఫికేషన్లను గతంలో ఎప్పుడూ వేయకపోవడంతో కోచింగ్‌ కేంద్రాలు, హాస్టళ్లు హౌజ్‌ఫుల్‌ అవుతున్నాయి. డిమాండ్‌ పెరగడంతో కోచింగ్‌ సెంటర్లు కూడా ఫీజులను భారీగా పెంచుతున్నాయి. ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరిగిపోతుండటంతో దానికి అనుగుణంగానే కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు అదనపు తరగతి గదులను సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో ఫంక్షన్‌ హాళ్లు, భవనాలు అద్దెకు తీసుకుంటున్నారు. అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బ్యాచ్‌ల వారీగా కోచింగ్‌లు ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement