Friday, November 22, 2024

భారత్‌ తరఫున ఆడటమే లక్ష్యం! అండర్‌-19 ప్రపంచకప్‌ విజేత యశ్‌ ధుల్‌

అంటిగ్వాలో జరిగిన 2022 ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా యువ భారత్‌ అవతరించింది. యశ్‌ ధుల్‌ సారథ్యంలోని భారతజట్టు ఫైనల్లో ఆదివారం ఇంగ్లండ్‌ను 4వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నమెంటులో అజేయంగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత్‌కు ఇది రికార్డుస్థాయిలో ఐదో టైటిల్‌. తుదిపోరులో ఐదు వికెట్లు పడగొట్టడంతోపాటు లక్ష్యఛేదనలో మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఆల్‌రౌండర్‌ రాజ్‌ బవా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అంతకుముందు సెమీస్‌పోరులో బలమైన ఆస్ట్రేలియా జట్టుపై సెంచరీ సాధించిన ధుల్‌..టోర్నీలో కరోనాతో జరిగిన పోరాటంలోనూ విజయం సాధించాడు. వైస్‌ కెప్టెన్‌, తెలుగు క్రికెటర్‌ షేక్‌ రషీద్‌ సెమీఫైనల్లో, ఫైనల్లో హాఫ్‌సెంచరీలు సాధించి తనదైన ముద్రవేశాడు. భారత యువజట్టు కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్‌ వేలం సందడి కంటే యువ క్రికెటర్లందరి ప్రధాన లక్ష్యం చివరికి భారత్‌ తరఫున జాతీయ సీనియర్‌ జట్టుకు ఆడటమే అని తెలిపాడు. జట్టు సభ్యులందరం పెద్ద విజయాన్ని ఆస్వాదించి గ్రౌండ్‌లో సంబరాలు చేసుకున్నామని తెలిపాడు. టీమిండియా క్రికెటర్‌గా తమ ప్రస్థానం ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. ఫైనల్లో రాజ్‌ బవా, రవికుమార్‌ తమ పనిని సులభతరం చేశారు. రాజ్‌ బంతిని అద్భుతంగా బౌన్స్‌ చేస్తే..రవి స్వింగ్‌ ప్రత్యర్థి జట్లును కట్టడి చేసింది.

మా టీమ్‌ ఛాంపియన్‌గా నిలవడం వెనుక ఉన్న పెద్ద రహస్యం..జట్టులోని ప్రతి ఒక్కరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. కరోనా బారిన పడినా వేర్వేరు ఆటగాళ్లు ఆడినా జట్టును రక్షించడానికి ఇదే కారణం. ఫైనల్‌ ముందు విరాట్‌కోహ్లీ మాట్లాడటం మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మిగతా మ్యాచ్‌ల మాదిరిగానే ఫైనల్‌ ఆడండని, ఫైనల్లో ఆడుతున్నామనే ఒత్తిడికి దూరంగా ఉండాలని తెలిపాడు. కోహ్లీతో మాట్లాడటం మాకు చాలా లాభించింది. మా జట్టులో అందరికీ ప్రణాళికలు ఉన్నాయి. అయితే అంతకంటే ముందు అహ్మదాబాద్‌ వెళ్లి సీనియర్‌ ఆటగాళ్లను కలవనున్నాం. ఆ సందర్భం కోసం అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని యశ్‌ పేర్కొన్నాడు. రంజీట్రోఫీలో ఆడేందుకు గౌహతి వెళ్లనున్నట్లు యశ్‌ తెలిపాడు. ఐపీఎల్‌ వేలంలో మాకు డిమాండ్‌ ఉంటుందని అంతా అంటున్నారు. కానీ అందరి లక్ష్యం ఒక్కటే..భారత్‌ తరఫున ఆడటం. అది మా అందరి కల అని కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ వెల్లడించాడు.

ఐసీసీ జట్టు కెప్టెన్‌గా యశ్‌ ధుల్‌..

టీమిండియా అండర్‌-19 కెప్టెన్‌గా యశ్‌ ధుల్‌ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఐసీసీ మోస్ట్‌ వ్యాల్యుబుల్‌ టీమ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో రాణించిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ఎంపిక చేసింది. 12మందితోకూడిన ఈ జట్టులో భారత్‌ నుంచి యశ్‌ ధుల్‌తోపాటు ఆల్‌రౌండర్‌ రాజ్‌ బవా, స్పిన్నర్‌ విక్కీ ఓస్తాల్‌ చోటు దక్కించుకున్నారు. ఐసీసీ జట్టులో భారత్‌నుంచి ముగ్గురు ఆటగాళ్లు, ఇంగ్లండ్‌, పాక్‌ నుంచి ఇద్దరేసి ఆటగాళ్లు ఎంపికయ్యారు. అదేవిధంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గ‌నిస్థాన్‌ నుంచి ఒక్కొక్కరు చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ టీమ్‌: యశ్‌ ధుల్‌ (కెప్టెన్‌), రాజ్‌ బవా, విక్కీ ఓస్తాల్‌ (భారత్‌), టామ్‌ ప్రెస్ట్‌, జోష్‌ బోడెన్‌ (ఇంగ్లండ్‌), హసీబుల్లా, అలీ (పాకిస్థాన్‌), టియాగో వైల్లి (ఆస్ట్రేలియా), బ్రేవిస్‌ (దక్షిణాఫ్రికా), దునిత్‌ (శ్రీలంక), రిపన్‌ మండల్‌ (బంగ్లాదేశ్‌), నూర్‌ అహ్మద్‌ (అఫ్గ‌నిస్థాన్‌ ).

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement