అన్ని వర్గాల ప్రజలను అవస్థలపాలు చేసి, అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ప్రస్తుత పాలన పోయి, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేమగిరిలోని మహానాడు సభలో ఆయన ప్రసంగించారు. ఆనాడు ఎన్టిఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాక ఎన్నో సంస్కరణలు తెచ్చారని, పేదవాడి ఆకలి తీర్చారని, అందరిలో రాజకీయ చైతన్యం తెచ్చారని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారని ఆయన వివరించారు.
అందుకే ఆయన మహానుభావుడు అయ్యాడని, మహానుభావుడు అవ్వాలంటే మహోన్నత వ్యక్తిత్వం, ఆదర్శం వంటి మంచి లక్షణాలు ఉండాలన్నారు. కానీ ఇప్పుడు వేరే రకం మహానుభావులను చూస్తున్నామని పరోక్షంగా జగన్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. అన్ని వ్యవస్థలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, లక్షల కోట్ల భక్షకుడు, రావణ పాలన అన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టిడ్కో ఇళ్లను లబ్డి³దారులకు ఇవ్వకుండా తాత్సారం చేసారని, ఇప్పుడు కూలిపోయే దశ తీసుకొచ్చి ఇస్తారేమో చూస్కోవాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో పరిశ్రమలు లేవని, నిరుద్యోగం పెరిగిందని, అదే సమయంలో దేశంలోనే నెంబర్‌వన్‌గా గంజాయి, డ్రగ్స్ లో మన రాష్ట్రాన్ని నిలబెట్టారని ఆయన అన్నారు. రైల్వే జోన్ అన్నారు, ప్రత్యేక హోదా అన్నారు వాటిని ఎందుకు గాలికి వదిలేశారని ఆయన ప్రశ్నించారు. దొరికిందల్లా దోచుకుని పబ్బం గడుపుకుంటున్నారని ఆయన అన్నారు. అందుకే మళ్ళీ తెలుగుదేశం పూర్వవైభవం సంతరించుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని బాలకృష్ణ చెబుతూ అందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.