న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సుదీర్ఘ చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీలో రెండు దశాబ్దాల అనంతరం జరిగిన అధ్యక్ష ఎన్నికల తంతు ముగిసింది. కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా జరిగిన ఈ ఎన్నికల అనంతరం ఎవరు అధ్యక్షులైనా గాంధీ-నెహ్రూ కుటుంబ జోక్యం, ప్రమేయం తప్పదని పలువురు నేతలు చెబుతున్నారు. నిజానికి తమకు అనుకూలమైన నేతనే బరిలో నిలబెట్టి, ఓటు హక్కు కల్గిన పీసీసీ ప్రతినిధులందరూ అతనికే ఓటు వేసేలా చేశారని గాంధీ కుటుంబం విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ విమర్శల్ని తిప్పికొడుతున్నారు. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైనవారు మాజీ అధ్యక్షుల అనుభవాలు తెలుసుకోవడం, వారి సూచనలు తీసుకోవడం తప్పేమీ కాదని చెబుతున్నారు.
ఈ క్రమంలో గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి వచ్చే సూచనల ప్రకారమే కొత్త అధ్యక్షుడు నడచుకోకతప్పదని, వాటిని సూచనలుగానే పరిగణించాలి తప్ప ఆదేశాలుగా పరిగణించకూడదని అంటున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఓటువేసిన అనంతరం టి. సుబ్బిరామిరెడ్డి, వంశీచంద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 75 మంది ప్రతినిధులు ఓటువేయడానికి వీలుగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తొలి ఓటు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం వేయగా, ఆయన తర్వాత మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి ఓటు వేశారు.
24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి పార్టీ అధ్యక్షుడు కావడంతోపాటు గాంధీ కుటుంబ సూచనలు కలిసి రెండింతల బలం చేకూరుతుందని సుబ్బిరామిరెడ్డి సూత్రీకరించారు. కొత్త నాయకత్వం నిర్ణయాల్లో పొరపాట్లను సరిదిద్దేలా గాంధీ కుటుంబం నుంచి సూచనలు ఉంటాయని ఆయనన్నారు. అయితే కొత్త అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేకు ఓటువేయాలని అధిష్టానం నుంచి సూచనలేమీ రాలేదని, అది కేవలం శశి థరూర్ అపోహ మాత్రమేనని అన్నారు.
అధ్యక్ష మార్పుతో కాదు.. జోడో యాత్రతోనే బలం: వంశీచంద్ రెడ్డి
రాజకీయ పార్టీల చరిత్రలో ఎంతో పారదర్శకంగా, పూర్తి ప్రజాస్వామ్య బద్ధంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి అన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీలో అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసినందుకు తనకు గర్వంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన వారి నుంచి కొత్త అధ్యక్షులు సూచనలు తీసుకోవడం తప్పేమీ కాదని, తాను కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు గతంలో ఆ పదవులు నిర్వహించిన పొన్నం ప్రభాకర్, మహేశ్ గౌడ్ తదితరుల సూచనలు తీసుకున్నానని అన్నారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ద్వారా వచ్చే ఉత్సాహం కంటే రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని వంశీచంద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సంస్థాగతంగా బలమైన నిర్మాణం కలిగి ఉందని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఒకరికే అధిష్టానం మద్ధతు పలికిందన్న ఆరోపణలను సైతం ఆయన కొట్టిపడేశారు. పీసీసీ ప్రతినిధులుగా ఉన్నవారు ఎంతో రాజకీయ పరిణితి కల్గిన సీనియర్ నేతలని, వారిని ఎవరూ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురిచేయలేని అన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇద్దరూ ఉద్ధండులేనని, వారిలో ఎవరినైనా ఎన్నుకునే స్వేచ్ఛ పీసీసీ డెలిగేట్లకు ఉందని అన్నారు.