Friday, November 22, 2024

దేశ భవిష్యత్ యువతదే : ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశాభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, అలాంటి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను దేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని తరగతి గదుల్లో మనం అందించే విజ్ఞానం, నైపుణ్యం ద్వారా నవభారతం రూపు దిద్దుకుంటుందని ఆయన తెలిపారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్‌రాజ్ కళాశాల 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, దేశం ఒక్కటిగా ముందుకు సాగే క్రమంలో విద్య పాత్ర మరింత కీలకమన్నారు. భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్న ఆయన, స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి, మహాత్మ హన్స్‌రాజ్ వంటి భారతమాత మహోన్నత పుత్రుల విజ్ఞాన వైభవోన్నతి నుంచి యువత ప్రేరణ పొందాలని సూచించారు. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహించే విద్యా వాతావరణాన్ని సృష్టించటంలో చేస్తున్న కృషికి హన్స్‌రాజ్ కళాశాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.

ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మారుతున్నఅవసరాలకు అనుగుణంగా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలను పునర్నిర్మించాలని జాతీయ విద్యా విధానం – 2020 ప్రయత్నిస్తుందన్న వెంకయ్య నాయుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయం జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆరోగ్యం, శారీరక దృఢత్వంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవరచుకోవాలని, యోగ, వ్యాయామం మీద దృష్టి పెట్టాలని, పౌష్టికాహారం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆర్ట్స్, సైన్స్, ఎకనామిక్స్, టెక్నాలజీ, మీడియా, అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్ వంటి వివిధ రంగాల్లో హన్స్ రాజ్ కళాశాల పూర్వ విద్యార్థుల కృషిని ప్రశంసిచిన ఉపరాష్ట్రపతి, దేశ నిర్మాణంలో వారి సహకారం సంస్థ ఉన్నతిని ప్రతిబింబించిందని తెలిపారు. మహర్షి దయానంద సరస్వతి, మహాత్మ హన్స్ రాజ్ జ్ఞాపకార్థం 1948 జులై 26న భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్. రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఈ కళాశాల ప్రారంభమైంది. ప్లాటినం జూబ్లీ వేడుకల్లో డిల్లీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. యోగేష్ సింగ్, హన్స్ రాజ్ కళాశాల పాలక మండలి అధ్యక్షులు డా. పూనమ్ సూరి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామ్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement