హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అధిక వ్యయం అయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ఈసీ దృష్టిసారించింది. ఆ తరహా నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 12 నియోజకవర్గాలతోపాటు మరో 48 నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఆయా ప్రాంతాలపై ఇప్పటినుంచే నిఘా పెట్టారు.
తెలంగాణలో ప్రారంభమైన ఎన్నికల ఫీవర్ ఈ ఏడాదంతా కొనసాగనున్న నేపథ్యంలో ఈసీ ఇందుకు అనుగుణంగా సిద్దమవుతోంది. బూత్‌ల గుర్తింపు ఇప్పటికే పూర్తికాగా అభ్యర్ధులు, ధన ప్రవాహం వంటి వాటిపై నియంత్రణలు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ ఎన్నికల్ కోడ్ అమలుకు కఠిన చర్యలు అమలవుతున్నాయి. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లు జిల్లాల వారీగా పకడ్బంధీగా జరుగుతున్నాయి.
ఎన్నికలకు అవసరమైన పోలింగ్ స్టేషన్లు మొదలు పరిశీలకులు, నిఘా బృందాలు అన్నీ సమకూరుతున్నాయి. ఎన్నికల పరిశీలకులను నియోజకవర్గాల వారీగా ఈసీ నియమిస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 20 బి ప్రకారం పరిశీలకుల నియామకం కొలిక్కి వచ్చింది. వీరు ఎన్నికల వ్యవస్థను అత్యంత సమీపంనుంచి పరిశీలిస్తారు.
అయితే వీరు రిటర్నింగ్ అధికారుల పనితీరుపై కూడా పర్యవేక్షణ చేస్తారు. వీరు తాము గమనించిన అంశాలను నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. పరిశీలకులు అనెగ్జర్ యం లేదా యస్ రూపంలో పంపే నివేదికలు కీలకమైనవి. ఎన్నికల పరిశీలకులకు ఓట్ల లెక్కింపును ఆపే అధిికారం ఉంటుంది. వీటితోపాటు ఫలితాలను నిలిపివేసే అధికారం కూడా వీరు కల్గి ఉంటారు.
వీరే కీలకం…
రిటర్నింగ్ అధికారుల పాత్ర ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైనది. ఈసీ ఆదేశాల మేరకు వల్నరేబుల్ మ్యాపింగ్ సిద్దం చేసుకుని, శాంతి భద్రతలపై పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికలు జరిపేందుకు స్టేషన్ల ఎంపికనుంచి వీరి కార్యాచరణ ప్రారంభమవుతుంది. చట్టసభలతోపాటు, స్థానిక ఎన్నికలకు రాష్ట్రంలో పరిస్థితులు సుగమయ్యాయి. ఈ ఏడాది నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాల నేపథ్యం తర్వాత కూడా వరుస ఎన్నికలే జరగనున్నాయి.
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా ఎన్నికల సందడి కొనసాగనుంది. వచ్చే ఏడాది మే నెలలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉన్న నేపథ్యంలో మళ్లి ఎన్నికలు అనివార్యమే. దీంతో జనవరి, ఫిబ్రవరినుంచే రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి ఆరంభం కానుంది. మే చివరి వరకు ఇది కొనసాగితే, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, మున్సిపల్ పాలకమండళ్లకుకూడా ఈలోగా గడువు ముగియనుంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అంతా ఎన్నికల ఏడాదే కావడంతో మద్యం, నగదు భారీగా పారనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగదుకు కొదువ లేదని ఆదాయపు పన్ను శాఖ అంచనా వేస్తోంది. గడచిన 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో అత్యధికంగా రూ. 153కోట్లు పట్టుబడటమే ఇందుకు తార్కాణమని ఐటీ శాఖ అంచనాలు వేసుకుంటోంది. దేశంలోనే అత్యధిక ధన ప్రవాహం, నగదు పంపిణీ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నట్లు గత లెక్కలు ధృవీకరిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం, పోలీస్ శాఖలు, ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న నగదు రూ. 313 కోట్లు కాగా రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన ఏపీ, తెలంగాణ ఉమ్మడిగా ఉన్న సమయంలో రూ. 153 కోట్లను సీజ్ చేశారు. 2018లో రూ. 230కోట్లను సీజ్ చేశారు. అయితే ఇదంతా కేవలం అధికారికంగా దాడుల్లో దొరికిందేనని, దొరక్కుండా ఓటర్లకు చేరింది, ఖర్చు చేసింది ఇంతకు వంద రెట్లకు పైనేని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బ్యాంకులనుంచి అధిక మొత్తాల్లో నగదు ఉపసంహరణ, నగదు ఎక్కువగా పారుతున్న ప్రాంతాలపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు, బంగారం, వెండి క్రయవిక్రయాలను నిశితంగా పరిశీలిస్తూ నిఘా తీవ్రతరం చేశారు. ఏ వ్యక్తి అయినా తన వ్యక్తిగత సేవింగ్స్ అకౌంట్‌లో రూ. 2.5 లక్షలకు మించి నగదును బ్యాంకులో డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసినా ఆదాయపు పన్ను శాఖ కొన్ని వివరాలను కోరనుంది.
నేరుగా ఖాతాదారుడికి నోటీస్‌లను పంపడం అందులో ఒకటికాగా సీక్రెట్ నిఘా ఇంకో విధానంగా ఉండనుంది. అన్ని బ్యాంకులకు చెందిన ఖాతాల్లోని అన్ ఆపరేటెడ్, గతంలో ఏనాడు పెద్ద మొత్తంలో నగదు జమ చేయని ఖాతాలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టింది. బ్యాంకులు నగదు రవాణా వాహనాలను నిర్దేశిత సమయాల్లోనే నడిపించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)ని ఈసీ ఆదేశించింది.
ఎన్నికల్లో అక్రమ నగదు రవాణాకు ఆ వాహనాలను వినియోగించే అవకాశం ఉందని గుర్తించినట్లు తెలిసింది. ఇక అంబులెన్సులు, ప్రభుత్వ వాహనాల్లో డబ్బు, ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేయాలని సంబంధిత యంత్రాంగాలను కోరింది. చీరలు, కుక్కర్లు వంటి ఎన్నికల్లో పంపిణీ చేసే కానుకలను నిల్వ చేసే ప్రైవేటు గోదాముల వద్ద గట్టి నిఘా పెట్టాలని రాష్ట్ర దర్యాప్తు సంస్థలను ఈసీ ఆదేశించింది.
రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లతో పాటు ఎయిర్‌పోర్టులు, కార్గో ప్లయిట్లు, ప్రైవేటు ఎయిర్‌స్ట్రిప్‌లు, రాజకీయ నేతలు వినియోగించే వాణిజ్యేతర విమానాలు, ప్రత్యేక విమానాలు సైతం తనిఖీ చేసేందుకు అధికారం కట్టబెట్టింది. పేమెంట్ వ్యాలెట్ల ద్వారా జరిగే ఆన్‌లైన్ నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని ఆర్బీఐ, ఎస్‌ఎల్‌బీసీకి సూచనలు చేసింది. ఒకే ఖాతా నుంచి వందల సంఖ్యలోని ఖాతాలకు ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ జరిగితే గుర్తించి విచారణ జరపాలని సూచనలు చేసింది.
చిన్న చిన్న డ్రగ్ పెడ్లర్లపై చర్యలతోనే సరిపెట్టరాదని, పెద్ద మొత్తంలో మద్యం, మాదక ద్రవ్యాల సరఫరా, ఇతర అక్రమాలకు పాల్పడే కింగ్‌పిన్స్‌ను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ కోరింది. రాష్ట్ర సరిహద్దులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 148 చెక్‌పోస్టులను సీసీటీవీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరంగా పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు కొత్త రికార్డుల దిశగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో త్రిముఖ పోరు జరగనున్న నేపథ్యంలో.. మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ- నెలకొననుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని మూడు పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటర్లు ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున నగదు, మద్యం, బంగారం, వెండి పంచేందుకు సిద్ధమయ్యారు నేతలు. అందుకోసం ఇప్పటి నుంచే వాటన్నింటినీ అక్రమంగా తరలించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి కూడా.
తెలంగాణలో నవంబర్ 30వ తేది జరగనున్న తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అయితే.. కోడ్ అములులోకి వచ్చిన రోజు నుంచి.. హైదరాబాద్ సిటీ- పోలీస్ నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తూ అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్‌తో పాటు- ఓటర్లను ప్రలోభ పెట్టే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటు-న్నారు. ఇప్పటికే ఇవి రూ. 30కోట్లకు మించాయి.