ఉమ్మడి కరీంనగర్, ప్రభన్యూస్ బ్యూరో: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం శుక్రవారానికి గెరువయింది. పలు చోట్ల రెస్క్యూ టీంలు పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాలు కాపాడారు. అయితే నాలుగు రోజుల క్రితం గల్లంతైన ఓ టీవీ రిపోర్టర్ జమీర్ ప్రాణాలతో బయటపడుతాడనుకుంటే మృత్యువై తేలాడు. చెట్ల కొమ్మల్లో చిక్కుకున్న మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించింది. జగిత్యాల రాయికల్ మండలం బోర్నపల్లిలో గోదావరి నదిలో చిక్కుకున్న వ్యవసాయ కూలీలను కాపాడేందుకు చేపట్టిన సహాయక కార్యక్రమాల కవరేజ్ కోసం రిపోర్టర్ జమీర్ అక్కడికి వెళ్లారు. అయితే భూపతిపూర్ డ్యామ్ వద్ద రోడ్డుపై నుంచి వాగు ప్రవహిస్తున్నప్పటికీ జమీర్ తన కారును ముందుకు తీసుకెళ్లడంతో కొట్టుకుపోయింది. జమీర్‌తో పాటు ఉన్న- మరో వ్యక్తి తప్పించుకుని ప్రాణాలు రక్షించుకోగా, రిపోర్టర్ వరదల్లో కొట్టు-కుపోయి ప్రాణాలు కోల్పోయారు. జమీర్ కుటు-ంబానికి అండగా ఉంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమీర్ వరదలో చిక్కుకొని మరణించడం బాధాకరమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. బాధిత కుటు-ంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఎమ్మెల్సీ కవిత ట్వీట్ ద్వారా జమీర్ మృతి పట్ల కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఇలా ఉంటే వర్షాలకు ఉమ్మడి జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది.
ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం వందకోట్లపైనే ఉంటుంది. వారంరోజుల వర్షానికి రహదారులు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లాలో 38 రహదారులు కోతకు గురయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 216 విద్యుత్ స్తంభాలు పడిపోగా, 85 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో 19 ప్రాంతాల్లోని 8 రహదారులు దెబ్బతిన్నాయి. పెద్దపల్లిలో 6 ప్రాంతాలలోని ఐదు రహదారులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 8 ప్రాంతాల్లో నాలుగు రహదారులు దెబ్బతిన్నాయి. వీటి నష్టం విలువ 32 కోట్ల రూపాయలు, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 600 విద్యుత్ స్తంభాలను మార్చారు. 50 డిస్టిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు వేశారు. ఇంకా 30 నీటిలో ఉన్నాయి. నష్టం విలువ రెండు కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంచనావేశారు. సెస్ పరిధిలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11కేవీ ఫీడర్లు, వాటి పరిధిలోని ట్రాన్స్‌ఫార్మర్లను సరిచేసి విద్యుత్‌ను పునరుద్ధరించారు. పంట విషయానికి వస్తే నాలుగు జిల్లాల్లోదాదాపు 40వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. జగిత్యాల జిల్లాలో 415 ఇళ్లు పాక్షికంగా, 19 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు 95వేల రూపాయలు మించకుండా సహాయం అందించనున్నారు. కరీంనగర్ జిల్లాలో 300కు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో 334 ఇళ్లు పాక్షికంగా మరో 21 ఇళ్లు పూర్తిగా దె బ్బతినట్లు గుర్తించారు. పెద్దపల్లి జిల్లాలో 400 ఇళ్లవరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తాత్కాలిక సహాయంగా ఇంటికి ఐదువేలు అందించాలని నిర్ణయించారు.