న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల తొలి జాబితా దాదాపు సిద్ధమైంది. గురువారం ఢిల్లీలో జరిగే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ జాబితాకు అధికారిక ముద్ర పడే అవకాశం ఉంది. సుమారు 40-50 మందితో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
తొలి జాబితాపై తుది కసరత్తులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డా. కే. లక్ష్మణ్ ఢిల్లీ బాట పట్టారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో గురువారం మంతనాలు సాగించి తొలి జాబితాకు తుది మెరుగులు దిద్దే అవకాశం ఉంది.
అలాగే సాయంత్రం జరిగే పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ జాబితాకు ఆమోదముద్ర వేస్తే అధికారికంగా జాబితాను విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుంది. గురు, శుక్రవారాల్లో తొలి జాబితాను బీజేపీ హెడ్‌క్వార్టర్స్ అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్ బాటలో తెలంగాణ?
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా కేంద్ర మంత్రులు, ఎంపీలను బరిలోకి దించింది. మధ్యప్రదేశ్‌లో పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చంబల్ ప్రాంతంలో ఈ ఎత్తుగడను పార్టీ అమలు చేస్తోంది. అందులో భాగంగా ముగ్గురు కేంద్రమంత్రులతో పాటు నలుగురు ఎంపీలను రంగంలోకి దించింది. కేంద్ర మంత్రుల్లో నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే ఉన్నారు. నలుగురు ఎంపీల్లో రాకేష్ సింగ్, గణేష్ సింగ్, రీతి పాఠక్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు.
ఈ ఏడుగురు నేతలు తమ సీట్లతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేయగలరని పార్టీ భావిస్తోంది. తద్వారా గత ఎన్నికల్లో తక్కువ సీట్లు గెలుచుకున్న ఈ ప్రాంతంలో ఈసారి ఎక్కువ సీట్లు గెలిచి ఆధిపత్యం చాటుకోవాలని పార్టీ భావిస్తోంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు చెందిన బీజేపీ నేతల్లో జాతీయస్థాయిలో పనిచేస్తున్నవారందరినీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
ఇందులో భాగంగా కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డితో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీగా ఉన్న బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడితో పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డా. కే. లక్ష్మణ్, ఇతర ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, జాతీయస్థాయి రాజకీయాల్లో ఉన్న మురళీధర్ రావు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ తదితరులందరినీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించనున్నట్టు ఊహాగానాలు నడుస్తున్నాయి.
ఆయా నేతలు తమ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేస్తే భారతీయ జనతా పార్టీ గణనీయంగా తన సీట్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుందని అధినేతల వ్యూహంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టేంత సంఖ్యాబలాన్ని పార్టీ సాధించలేదన్న విషయం అధిష్టానం పెద్దలకు సైతం అవగతమైంది. అందుకే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో రాష్ట్రంలో హంగ్ ఫలితాలు వస్తాయని, బీజేపీ కింగ్ మేకర్‌గా మారి అధికారాన్ని సైతం చేపడుతుందని సంకేతాలిచ్చారు.
ఈ ఎన్నికలను ప్రతి నియోజకవర్గంలో త్రిముఖ పోరుగా మార్చాలని, ముక్కోణపు పోటీ ఏర్పడితే బీజేపీ గెలుపు అవకాశాలు సైతం మెరుగుపడతాయని కూడా కమలనాథులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసేలోగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.