శ్రీలంకలో రోజురోజుకు ఆర్థిక సంక్షోభం ముదిరిపోతోంది. నిత్యావసరాలు, మందులు, గ్యాస్ కొరతతోపాటు రోజూ 13 గంటల విద్యుత్ కోతతో తల్లడిల్లుతున్న ప్రజలు ఇక పట్టలేక రోడ్డెక్కారు. గురువారం కొలంబోలో మొదలైన నిరసనలు శుక్రవారం మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ప్రైవేటు నివాస భవనం వద్ద గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత పెద్దసంఖ్యలో ప్రజలు నిరసనలకు దిగారు. దేశంలో దుస్థితికి కారణమైన అధ్యక్షుడు గొట్టబాయ, అధికారంలో ఉన్న అతడి కుటుంబ సభ్యులు పదవులనుండి వైదొలగాలని కోరుతూ విధ్వంసానికి పాల్పడ్డారు. అధ్యక్షుడి ఇంటివద్ధ ఉన్న ఆర్మీ వాహనాలకు నిప్పుపెట్టారు. బారికేడ్లు విరగ్గొట్టి దూసుకొచ్చారు. గొట్టా గో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గ్యాస్ లేదు.. పాలు లేవు, విద్యుత్ లేదు.. గ్యాస్ లేదు.. ఈ దుస్థితికి మీ వైఫల్యమే కారణం, పదవినుంచి దిగిపోండంటూ నినదించారు. ఆందోళనల సమయంలో అధ్యక్షుడు ఆ భవనం లేరు.
దేశంలోని ఒక ప్రార్థనాస్థలంపై దాడి, కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పర్యాటక రంగం దెబ్బతినడంతో విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోయింది. ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీనిని ఎదుర్కొనేందుకు దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఆహార కొరత ఏర్పడింది. ఇప్పుడు నిత్యావసరాలూ లభ్యమవడం లేదు. మరోవైపు జలాశయాల్లో నీళ్లు అడుగంటుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. చివరకు 13 గంటల కోతతోపాటు రాత్రిపూట వీధిదీపాలు ఆర్పివేయడం మొదలుపెట్టారు. ఇలా అన్నివైపులనుంచి సమస్యలు చుట్టుముట్టి దేశం అల్లకల్లోలంగా తయారయ్యింది. ఇదంతా పాలనావైఫల్యమేనని, అధ్యక్షుడు, ప్రధాని, కీలక మంత్రి పదవులున్నీ గొట్టబాయ కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉన్నాయి. దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం నెలకొని నిరసనలకు దారితీసింది. కాగా పరిస్థితిని చక్కదిద్దేందుకు పనిగరిగట్టు వీధిలోని అధ్యక్షుడి ప్రైవేటు భవనం వద్దకు చేరుకున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టాయి. గురువారం రాత్రినుంచి కర్ఫ్యూ విధించి శుక్రవారం సాయంత్రానికి ఎత్తివేశాయి. కాగా డీజిల్ , పెట్రోల్ కొరతవల్ల ప్రజారవాణా వ్యవస్థలు స్తంభించాయి. బస్సులు తిరగడం లేదు. చివరకు మొబైల్ ఫోన్ల వ్యవస్థ పనిచేయడం లేదు. 1948 తరువాత శ్రీలంకలో ఎప్పుడూ ఇంతటి సంక్షోభం తలెత్తలేదు.
నిరవధిక కర్ఫ్యూ గురువారం రాత్రి నిరసనలకు దిగిన వారిపై వాటర్ కానన్లతో పోలీసులు చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటనల్లో 50మందికి పైగా గాయపడ్డారు. వందలమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇది విపక్షాలతో సంబంధం ఉన్న ఉగ్రవాద శక్తుల కుట్ర అని అధ్యక్షుడు రాజపక్సే ప్రభుత్వం వ్యాఖ్యానించింది. గురువారం రాత్రి పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో కర్ఫ్యూ విధించారు. ఆ తరువాత ఎత్తివేసినప్పటికీ శుక్రవారం మళ్లి ప్రజలు నిరసనలకు దిగడంతో నిరవధిక కర్ఫ్యూ విధించారు. శుక్రవారం కొలంబో మేయర్ ఇంటివద్ద పెద్దఎత్తున ప్రజలు ఆందోళనకు దిగారు. మేయర్ మొరటువా ఇంటిపైకి రాళ్లు రువ్వారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాజధాని నగరంలోనే ఇలాంటి దుస్థితి ఉంటే ఎలా మిన్నకున్నారని ప్రశ్నించారు. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు.
శ్రీలంక తమిళులను ఆదుకుంటాం – స్టాలిన్..
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిత్యావసరాలకోసం అవస్థలు పడుతున్న అక్కడి తమిళులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని నరేంద్రమోడీని కోరారు. శ్రీలంక తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో నివసిస్తున్న తమిళులకు నిత్యాువసరాలు, ఔషధాలు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కాగా తమ వినతిపట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారని, సాయం అందించేదుకు వీలుగా తగిన చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారని స్టాలిన్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..