Friday, November 22, 2024

ఇక వేగంగా నియామకాలు.. తొలగిన రిజర్వేషన్ల సమస్య

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అన్ని ఇబ్బందులు క్రమంగా తొలగడంతో నియామకాలకు గ్రహణం వీడింది. తాజాగా గిరిజన రిజర్వేషన్ల పెంపుతోపాటు, రోస్టర్‌ పాయింట్ల ఖరారు వంటి చర్యలు పూర్తి చేయడంతో నియామకాల ప్రక్రియ శరవేగంగా పూర్తికానుంది. గ్రూప్‌-1 కీ విడుదల నేపథ్యంలో మెయిన్స్‌కు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన 80,039 జాబ్‌ రిక్రూట్‌మెంట్లలో మెజార్టీ నోటిఫికేషన్లకు ఆర్ధిక శాఖ అనుమతులను జారీ చేసింది. అదేవిధంగా సీఎం కేసీఆర్‌ గతంలో ఏ సర్కార్‌ అమలు చేయని రీతిలో సాహసోపేతంగా ఓసీలకు 44ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 49ఏళ్లు, దివ్యాంగులకు 54ఏళ్ల వరకు వయోపరిమితిని పెంచారు.

ఈ నేపథ్యంలో పోటీ తీవ్రమైంది. ఆయన ప్రకటించిన నాటినుంచే ఆర్ధిక శాఖ కసరత్తు వేగవంతం చేసింది. ఖాళీలను ముందుగానే గుర్తించి ప్రతీ ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ రూపకల్పనకు ప్రభుత్వం కృషి చేసింది. పారదర్శకంగా నియామకాలకు సకల జాగ్రత్తలు తీసుకున్నది. అన్ని విభాగాలు, ప్రభుత్వ శాఖలు ప్రతీయేటా ఏర్పడే ఖాళీల వివరాలతో ఎప్పటికప్పుడు నివేదికలను సిద్దం చేస్తున్నాయి. తద్వారా నోటిఫికేషన్ల జారీకి ఆయా నియామక సంస్థలకు సమాచారం చేరవేయాలని ఇప్పటికే నిర్ణయించారు.

రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6నుంచి 10శాతానికి పెరగడంతో అందుకు వీలుగా ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులు ప్రభుత్వం పూర్తి చేసింది. ఇప్పటికే పురోగతిలో ఉన్న నియామకాల్లో, రానున్న నోటిఫికేషన్లలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లకు వీలుగా సవరణలు చిత్తశుద్ధితో కొలిక్కి తెచ్చింది. దీంతో జాప్యం తొలగిపోయింది. 10శాతం రిజర్వేషన్ల నేపథ్యంలో 100 రోస్టర్‌ పాయింట్లలో 10 రోస్టర్‌ పాయింట్లు గిరిజనులకు రిజర్వ్‌ చేసింది. ఇప్పటికే 52 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు జారీ చేయగా, 18వేల పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎస్సై ఉద్యోగాలకు నియామక ప్రక్రియ పురోగతిలో ఉంది.

- Advertisement -

గ్రూప్‌-4 ఉద్యోగాలకు ఒక్కో జిల్లాలో 74 విభాగాల చొప్పున 33 జిల్లాలు ప్రతిపాదనలు అందించాయి. ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ, ఇతర గురుకులాల్లో 9వేల ఉద్యోగాలకు ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నాయి. గ్రూప్‌-2, గ్రూప్‌ 3 పోస్టులకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మిగతా ఉద్యోగాల నోటిఫికేషన్లకు టీఎస్‌పీఎస్సీతోపాటు, ఆయా నియామక సంస్థలు పరిశీలిస్తున్నాయి. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టి జోన్ల నేపథ్యంలో రోస్టర్‌ పాయింట్‌ 1నుంచి నియామకాలు అమలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement