Friday, November 8, 2024

TG | మూడురోజుల ముందే పండగొచ్చింది : సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎల్‌బీ స్టేడియంలో డీఎస్సీ -2024లో ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మిమ్మల్ని చూస్తోంటే దసరా పండుగ మూడు రోజుల ముందే వచ్చిన ట్లుంది.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు గత పదేళ్లు కోరి కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ కొరివి దెయ్యాన్ని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని మండిపడ్డారు.

అన్ని అవాంతరాలను అధిగమించి కేవలం 65 రోజుల్లోనే డీఎస్సీ-2024 నిర్వహించి 10,006 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 34వేల మంది టీచర్ల బదిలీలతో పాటు 21వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించిన ఘనత ఇందిరమ్మ రాజ్యానిదేనని చెప్పారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని, తెలంగాణ వచ్చిన వెంటనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండగా, మూడేళ్లు ఆలస్యంగా 2017లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి వెంటనే ఫలితాలు ప్రకటించకుండా రెండేళ్ల తరువాత 2019 నియామకాలు జరిపారని విమర్శించారు.

చదువుకున్న చదువులకు సార్థకత ఉండే విధంగా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర అత్యంత కీలకమని, ఉపాధ్యాయులు భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దే నిర్మాతలని సీఎం అభివర్ణించారు. నాతో పాటు ఇక్కడున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కేకే తో పాటు చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్ళమేనని సీఎం గుర్తు చేశారు.

మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటే ప్రజలు తిప్పికొడతారు

మళ్లి అధికారంలోకి రావాలని బీఆర్‌ఎస్‌ నేతలు కలలుగంటున్నారని, అది కలే అని అన్నారు. మా ప్రభుత్వాన్ని నిర్ణీత కాలపరిమితికన్నా ముందే కూలగొడతామనుకుంటే ప్రజలే తిప్పికొడతారని హెచ్చరించారు. ప్రజల సంక్షేమం కోసం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌, ఆయన కొడుకు కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడే మాట ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారమే ఇవాళ ఉద్యోగ నియామకాలు చేపట్టామని కొత్త అధ్యాపకుల హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రి ప్రకటించారు.

- Advertisement -

తెలంగాణ పిల్లలు, మన పిల్లలు.. మన తమ్ముళ్లు,. మన చెల్లెళ్లు కాదా? పేదోళ్ల ఇళ్లల్లో సంతోషం ఉండొద్దా? మీ కుటుంబం బాగుంటె అంతా బాగున్నట్లా? మీకు మీ స్వార్థం తప్ప పేదలు అవసరం లేదా ? అని కేసీఆర్‌పై మండిపడ్డారు. తాము మాత్రం కేసీఆర్‌ మాదిరి కాదని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచే తెలంగాణ బిడ్డల అభ్యున్నతి, రాష్ట్ర ప్రగతి కోసం పది నెలల్లో ఒక్క రోజు, ఒక్క గంట కూడా వృధా చేయకుండా పని చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణ బిడ్డలు బంగారు పతకాలు సాధించాలి

వచ్చే ఒలింపిక్స్‌లో తెలంగాణ బిడ్డలు బంగారు పతకాలను సాధించాలనేదది తన లక్ష్యమని అందుకే గచ్చిబౌలిలో 70 ఎకరాల్లో క్రీడా యూనివర్సిటీని ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. కేవలం 4 కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా ఒలింపిక్స్‌లో పతకాల పంటను సాధించిందని, 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు ఎన్ని పథకాలు రావాలో ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో ఏర్పాటుకానున్న క్రీడా యూనివర్సిటి దేశానికే తలమానికం కానుందని సీఎం చెప్పారు. భవిష్యత్తు నిర్మాతలు ఉపాధ్యాయులేనని, భావి నిర్మాతలను తీర్చిదిద్దాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement