హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి… ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో చోటు చేసుకుంది. పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ పెళ్లింట్లో విషాదం నెలకొంది. కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా వధువు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఇటీవల జరిగిన మెహందీ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేసి ఉత్సాహంగా గడిపిన రవళి.. ఆత్మహత్యకు పాల్పడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పెళ్లి కొడుకు పెట్టిన మానసిక క్షోభతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని పెళ్లి కూతురు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నవీపేటకు చెందిన ర్యాగల రవళి (26)కు నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడితో ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. నిర్ణయించిన ముహూర్తం మేరకు ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు నిజామాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాశలులోవివాహం జరగాల్సి ఉంది.
కొద్ది సేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన రవళి తన ఇంట్లోని స్టోర్ రూంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్టోర్‌రూం గది తలుపులు తెరిచి ఉండడంతో యువతి తండ్రి ప్రభాకర్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా… కాబోయే పెళ్లి కొడుకు శనివారం రాత్రి 10.30 గంటలకు తమ కుమార్తెకు ఫోన్ చేశాడని, అతడు పెట్టిన మానసిక క్షొభతోనే రవళి ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లికి ముందే ఉద్యోగం చేయాలని, పలు రకాలుగా ఒత్తిళ్లకు గురిచేయడంతోనే రవళి ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. ఈ మేరకు పెళ్లి కుమారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.
వేధించలేదు: వరుడు సంతోష్
తనపై వస్తున్న ఆరోపణలను నిజామాబాద్‌కు వరుడు చెందిన సంతోష్ ఖండించారు. వధువు రవళిని తాను వేధించలేదని, ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని తెలిపాడు. ఉదయం కళ్యాణ మండపంలో ఫోటో షూట్ ఉన్నందున త్వరగా రావాలని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. ఎంగేజ్‌మెంట్ సమయంలో మాట్లాడుకున్న కట్నకానుకలు తప్ప తాను అత్తింటి వారిని ఒక్క రూపాయి కూడా అదనంగా అడగలేదని స్పష్టం చేశారు. పెళ్లి తర్వాత జాబ్ చేయాలని కోరింది నిజమేనని దానికి ర వళి కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుందన్నారు. తండ్రి వద్దన్నందుకే ఇన్నీ రోజులు జాబ్ చేయలేదని చెప్పిందని వివరించాడు.
రాత్రి 10 గంటల సమయంలో రవళితో మాట్లాడానని ఉదయం ఆమె చావు వార్త విని షాక్ అయ్యానని విచారం వ్యక్తం చేశారు. రవళి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు తాను ఎలాంటి టార్చర్ పెట్టలేదని స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నాడు. వధువు కుటుంబ సభ్యుల నిరాధారమైన ఆరోపణలతో తన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.