Monday, November 25, 2024

ఎయిర్‌పోర్టు మెట్రోపై గ్లోబల్‌ కంపెనీల కన్ను.. శరవేగంగా ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎయిర్‌పోర్టుకు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో నిర్మాణానికి జనరల్‌ కన్సల్టెంట్‌(జీసీ)గా వ్యవహరించేందుకుగాను హెచ్‌ఏఎమ్‌ఎల్‌ ఆహ్వానించిన బిడ్లకు భారీ స్పందన వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో మెట్రో రైలు నిర్మాణంలో పేరొందిన పలు సంస్థలు ఎయిర్‌పోర్టు మెట్రోగా వ్యవహరించేందుకుగాను బిడ్లు దాఖలు చేసినట్లు హైదరాబాద్‌ మెట్రోరైల్‌(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టుకు మెట్రో నిర్మాణంలో జనరల్‌ కన్సల్టెంట్‌దే కీలకపాత్ర అని వారు పేర్కొన్నారు. జీసీ ఎంపిక కోసం ఆరు అంతర్జాతీయ సంస్థలతో కూడిన కన్సార్షియంలు పోటీ పడ్డాయని, వీటిలో కొన్ని దేశీయ సంస్థలతో కలుపుకుని సంయుక్త బిడ్లు దాఖలు చేశాయి.

- Advertisement -

బిడ్లు దాఖలు చేసిన కన్సార్షియంలు ఇవే…

దక్షిణ కొరియాకు చెందిన కొరియా నేషనల్‌ రైల్వేతో పాటు ఈ జాబితాలో ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలకు చెందిన కంపెనీలున్నాయి. మొత్తంగా 13 ప్రతిష్టాత్మక దేశ, విదేశీ సంస్థలు ఐదు కన్సార్షియంలుగా ఏర్పడి ప్రీ క్వాలిఫికేషన్‌ బిడ్లు దాఖలు చేశాయి. బిడ్లను ఈ నెల చివరి వరకు వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి జీసీని ఎంపిక చేయనున్నట్లు హెచ్‌ఏఎంఎల్‌ అధికారులు తెలిపారు. ఈ జాబితాలో సిస్ట్రా(ఫ్రాన్స్‌), ఆర్‌ఐటీఈఎస్‌(ఇండియా, డీబీ ఇంజినీరింగ్‌ అండ్‌ కన్సల్టింగ్‌(జర్మనీ), ఆయేషా ఇంజనెర్సియా అర్కెటెక్ట్రా(స్పెయిన్‌), నిప్పాన్‌ కోయి(జపాన్‌), ఆర్వీ అసోసియేట్స్‌ ఇండియా, టెక్నికా వై ప్రోయెక్టోస్‌(స్పెయిన్‌), పీనీ గ్రూప్‌ (స్విట్జర్లాండ్‌), ఏఈకామ్‌ ఇండియా, ఈజిస్‌ రెయిల్‌(ఫ్రాన్స్‌), ఈజిస్‌ ఇండియా, కన్సల్టింగ్‌ ఇంజినీర్స్‌ గ్రూప్‌(ఇండియా), కొరియా నేషనల్‌ రైల్వే( సౌత్‌ కొరియా) తదితర ప్రతిష్టాత్మక సంస్థలు ఎయిర్‌పోర్టు మెట్రో జీసీకి బిడ్లు దాఖలు చేశాయి.

మూడేళ్లలో పూర్తికి ధృడనిశ్చయంతో ప్రభుత్వం…

ఇప్పుడున్న రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి మూడేళ్ల తర్వాత ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో రైలును శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధృడ నిశ్చయంతో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ప్రతి పెద్ద ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిందే కావడంతో తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత ఉండాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఎయిర్‌పోర్టుకు ప్రస్తుతం ఉన్న రవాణా సమస్యలు, ఖర్చు, సమయం వృథాను అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వీలైనంత త్వరగా ఎయిర్‌పోర్టు మెట్రో రైలును పట్టాలెక్కించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసినట్లు వారు చెబుతున్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కావాల్సిన నిధుల్లో తొలి విడత నిధులను ఇటు ఈక్విటీ నిధులు, అటు రుణాల ద్వారా సమకూర్చుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement