పోలవరం, ప్రభ న్యూస్ : పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ విషయంపై ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చిన సందిగ్ధత వీడిపోయింది. కేంద్ర బృందాలు గత కొద్ది నెలలుగా ప్రాజెక్టు డయాఫ్రం వాల్ విషయంపై పరిశీలనలో జరిపాయి. శనివారం 37 మందితో కూడిన వివిధ శాఖల నిపుణులు వచ్చి డయాఫ్రం వాల్‌తో సహా ప్రాజక్ట్ అన్ని విభాగాలు పరిశీలించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా ప్రాజెక్టును సందర్శించారు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ 485 మీటర్ల మేర నాలుగు చోట్ల దెబ్బతిన్నదని నిపుణులు తేల్చారని ఆయన చెప్పారు. దెబ్బతిన్న భాగాలలో మాత్రమే మరమ్మతులు చేసుకోవచ్చని రిపోర్టును నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ ఇచ్చిందని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ లను పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడం చంద్రబాబు చేసిన తప్పిదమని మంత్రి విమర్శించారు. కాఫర్ డ్యాంలో గ్యాప్ ద్వారా వరద ప్రవాహానికి -22 మీటర్ల దాకా స్కవార్స్, పిట్స్ ఏర్పడ్డాయన్నారు. అవి బాగు చేయకుంటే పనులు చేయడం కష్టసాధ్యమన్నారు. వీటికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ఈ విధంగా డయా ఫ్రమ్ వాల్ 485 మీటర్ల మేర దెబ్బతింది వివరించారు. దెబ్బతిన్న ప్రాంతానికి ఎంత ఖర్చవుతుందో నిపుణులు అంచనా వేస్తున్నారని చెప్పారు. ఇది పూర్తిగా చంద్రబాబు తప్పిదమని మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
డయా ఫ్రమ్ వాల్ నిర్మాణానికి గతంలో 400 కోట్లు ఖర్చు అయిందన్నారు.కాగితాలపై ఉన్న ప్రాజెక్టుని గ్రౌండ్ లెవెల్‌కి తీసుకువచ్చి ప్రారంభించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అని ఆయన అన్నారు. అయితే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి హంగులు ఆర్భాటాలు ప్రచారాల కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు పోలవరం పనులు చేపట్టారని అన్నారు. డయాఫ్రమ్ వాల్‌పై వరద జలాలు ప్రవహించకుండా కాపర్ డ్యాంలు పూర్తిచేసిన తర్వాతే డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని వుందన్నారు. కానీ గత ప్రభుత్వం దానికి విరుద్ధంగా పని చేసిందని అన్నారు. 41.15 కాంటూర్ లెవెల్ పరిధిలో నిర్వాసితులందరికీ పరిహారాలు చెల్లిస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రావాల్సి ఉందన్నారు. కేంద్రానికి నిధుల విడుదల కోసం అభ్యర్థనలు పంపామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవచేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం 1800 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించిందని మంత్రి అన్నారు. ఇప్పటికే 366 కోట్ల రూపాయలు విడుదల చేశారని, మిగిలిన నిధులు కూడా రావాల్సి ఉన్నాయని తెలిపారు.
వరదలు రాకమునుపే వేగవంతంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. తొందరపాటు నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లలేమని, సావధానంగా ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఈ సీజన్లోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని భావించడం లేదని స్పష్టం చేశారు.
వైబ్రో కాంప్లెక్షన్ పనులకు 48 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని, ఇప్పటికే 28 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సేకరించడం జరిగిందని అన్నారు. ఇంకా 20 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక సేకరించవలసిన అవసరం ఉందన్నారు.
గత ఏడాది వరదల వలన డయాఫ్రంవాల్ కి పరీక్షలు నిర్వహించలేకపోయామని అన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, చీఫ్ ఇంజనీర్ సి. నారాయణ రెడ్డి, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ చైర్మన్ ఏబీ పాండ్య, సభ్యులు డి పీ భార్గవ, అనిల్ జైన్, టి వి ఎన్ ఏ ఆర్ కుమార్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ- సి ఈ ఓ శివే నందన్ కుమార్, ప్రొఫెసర్ వి ఎస్ రాజు, సి ఎస్ ఎం ఎస్ డైరెక్టర్ చిత్ర ,మేఘా సంస్థ ప్రతినిధులు ఎం ముద్దుకృష్ణ, క్రాంతి, రాజేష్, మురళి ఉన్నారు.