Tuesday, November 26, 2024

Big story | బడ్జెట్‌ కసరత్తు షురూ.. శాఖల వారీగా సిద్ధమవుతున్న నివేదికలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై మందిపు మొదలవుతోంది. త్వరలో ప్రిబడ్ఝెట్‌ కసరత్తుకు ప్రభుత్వం ఆదేశాలు రెడీ చేస్తోంది., సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఆర్ధిక శాఖ ఎన్నికల బడ్జెట్‌ రూపకల్పనకు సమాయత్తమవుతోంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఇచ్చే ఆర్ధికపరమైన సాయాలు, ఇతర అంశాలపై ఫిబ్రవరి 1న స్పష్టత రానుంది. అయితే కేంద్ర వనరులు, గ్రాంట్లు, సాయాలపై ఆధారపడకుండా సొంత వనరుల ఆదాయంపైనే సర్కార్‌ దృష్టిసారించి బడ్జెట్‌ పద్దులను, బడ్జెట్‌ సరిమాణాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా శాఖల వారీగా విస్తృత కార్యాచరణ మొదలైంది. ఈ ఏడాదిలో శాసనసభా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు భారీగా నిధులను కేటాయించేలా సీఎం కేసీఆర్‌ ఆర్ధిక శాఖను ఆదేశించినట్లు తెలిసింది. పన్నులు, పన్నేతర ఆదాయాలపై 20శాతంమేర అంచనాలను పెంచుకునేందుకు కీలక కార్యాచరణ ముమ్మరం చేసింది.

వచ్చే ఆర్ధిక ఏడాది అంటే 2023-24లో సంక్షేమ పథకాలకు భారీగా వ్యయాలు, అందుకు అనుగుణంగా కేటాయింపులు చేయాల్సి ఉంది. రైతుబంధు, ఆసరా పింఛన్లు, దళితబంధు, రైతుబీమా, విద్యుత్‌ సబ్సిడీలు, విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు, కేసీఆర్‌ కిట్‌, షాదీ ముకారఖ్‌, కళ్యాణక్ష్మి, కొత్త ఇంటి పథకంతోపాటు ఇతర అనేక పథకాలకు భారీగా నిధుల సమన్వయం, సర్దుబాటు తప్పనిసరి కానుంది. ఎన్నికల ఏడాదిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ తప్పనిసరి కావడంతో డిసెంబర్‌ రాబడుల ఆధారంగా ప్రభుత్వం అంచనాలను రూపొందించుకుంటోంది.

- Advertisement -

వీటి ఆధారంగానే బడ్జెట్‌ కూర్పు దిశగా ప్రభుత్వం సమాయత్తమౖవుతోంది. ప్రస్తుత ఆర్ధిక ఏడాది చివరి త్రైమాసికానికి చేరడంతో రాష్ట్ర రాబడులు, అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సమీక్షించనుంది. బడ్జెట్‌ కూర్పుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌ను సమీక్షించుకోనున్నది. శాఖల వారీగా ఇప్పటి వరకు నిధుల వ్యయం, ఇంకా పెండింగ్‌లు, పథకాల వారీగా కావాల్సిన మొత్తాలు, ఈ ఆర్ధిక ఏడాది చివరకు ఇంకా ఎంత మొత్తం తప్పనిసరి పథకాలు, వ్యయాలు ఖర్చులు ఉన్నాయనే కోణంలో సమగ్రంగా సమీక్షించనుంది.

దేశవ్యాప్తంగా పన్నుల వసూళ్ళు భేషుగ్గా ఆన్నా కేంద్ర కావాలనే రాష్ట్రానికి రావలసిన నిధుల్లో భారీగా కోత విధించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన పన్నుల వాటాలో 80శాతం తగ్గిందని ఆర్థికశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రానికి రావలసిన గ్రాంట్ల మొత్తంలో తగ్గుదల భారీగా ఉందని సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇప్పటివరకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు 20శాతానికి మించలేదు. అక్టోబర్‌ నాటికి కేంద్రంనుంచి రావాల్సిన నిధుల్లో పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు రూ.59వేల కోట్లు అంచనా వేసుకోగా, కేవలం రూ.11వేల కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఏడు నెలల్లో కేంద్ర పన్నుల వాటాకింద రూ.5911కోట్లు, ఇక గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు రూ.41వేల కోట్లు అంచనాకుగానూ రూ.5592కోట్లు మాత్రమే వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వంనుంచి రావాల్సిన గ్రాంట్లలో కోతలు, సెస్సుల పేరుతో ఎగవేతలు, జీఎస్టీ బకాయిలు, పెండింగ్‌ బకాయిలను విడుదల చేయడంలో కేంద్ర వైఖరి కారణంగా రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం కల్గుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ అంచనాలు గతి తప్పుతున్నాయి. ఇలా రకరకాలుగా బడ్జెట్‌లో నిర్దేశించుకున్న రాబడులు, ఆదాయాలపై రూ. 50వేల కోట్లు లోటు ఏర్పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ ఏడాది 80 శాతం మేర రాష్ట్రానికి రావలసిన నిధులు తగ్గాయని సీఎం కేసీఆర్‌కు ఆర్ధిక శాఖ ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. అన్ని రకాల పెండింగ్‌ నిధులు కలుపుకుని ఈ ఏడాదికి కేంద్రం నుంచి ఇంకా రూ.35 వేల కోట్లు తెలంగాణ రావాల్సి ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను సకాలంలో ఇవ్వకపోవడం, అప్పుల పరిమితుల్లో కోతలు విధించడం వంటి వాటితోపాటు, కొత్త కొత్త చట్టాలతో షరతులు విధించి వాటిని అమలు చేస్తేనే అప్పుల పరిమితిని పెంచుతామని బహిరంగ బెదిరింపులకు కేంద్రం దిగుతోంది. ఇలా ఈ ఏడాదిలో ఎఫ్‌ఆర్‌బీఎంలో కోతలు విధించకుండా ఉండి ఉంటే రాష్ట్ర ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22శాతం వృద్ధిరేటు నమోదయ్యేదని ఆర్ధిక వర్గాలు భావిస్తున్నాయి. గొప్పలు చెప్పుకుంటున్న మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంనుంచి కేంద్ర ప్రాయోజిత పథకాల రూపంలో గత 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ.47,312 కోట్లు నిధులు మాత్రమే తెలంగాణకు అందినట్లు లెక్కలు ధృవీకరిస్తున్నాయి.

కొత్త లబ్దిదారులతో మరింత భారం…

రైతు రుణమాఫీ, రైతుబంధులలో కొత్త లబ్దిదారులతో పాటు కొత్తగా సామాజిక పించన్ల పెంపుతో ఖజానాపై మరింత భారం పడనుంది. ఇప్పటివరకు లోటు ప్రభావం పడకుండా నెట్టుకొచ్చిన ప్రభుత్వానికి తాజా విపత్కర పరిస్థితిని ధీటుగా ఎదుర్కొనేందుకు నిధుల సమీకరణ, అత్యవసర వ్యయాలు, వడ్డీలు, రుణాల రీపేమెంట్‌ వంటివి అతిపెద్ద సవాలుగా మారాయి. ఇప్పటికే కార్పొరేషన్ల పేరుతో చేసిన గ్యారంటీ అప్పులను నిలిపివేయగా తుది దశలో ఉన్న ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు నిధుల సమన్వయం రాష్ట్ర ప్రభుత్వానికి కత్తీమద సాముగా మారింది. ఇంతటి విషమ సమయంలో ప్రజలపై భారం మోపకుండా, కొత్త పన్నులు వేయకుండా సంపద పెంచి సరికొత్త రీతిలో ఆర్ధిక సర్దుబాటు దిశగా కార్యాచరణ చేస్తోంది. కేంద్రం వద్ద ఉన్న పెండింగ్‌ జీఎస్టీ బకాయిలు, జీఎస్టీ రిజిస్ట్రేషన్ల పేరుతో ఏపీకి తరలిన నిధులు, ఇతర ఆదాయాలపై త్వరలో జాతీయ స్థాయిలో వినిపించేలా కార్యాచరణ రూపొందించుకుంటోంది.

భారీ అంచనాలు..

2022-23 ఆర్ధిక యేడాదిలో రూ. 1.33 లక్షల కోట్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో పొందేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అన్ని సొంత వనరుల రాబడి శాఖలకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. జీఎస్టీ, అమ్మకం పన్ను, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌, ఇతర ఆదాయాలపై సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయా శాఖల రాబడిపై ఈ ఆర్ధిక యేడాదిలో నెలవారీ సమీక్షలకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అంచనాల చేరికలో ఇబ్బందులు పడుతున్న సొంత వనరుల రాబడి శాఖల్లో పురోగతిని పరిశీలించి ఎప్పటికప్పుడు వేగవంతంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక మరో కీలక వనరుగా ఉన్న పన్నేతర రాబడులను కూడా ఈ ఏడాది రూ. 7వేల కోట్లనుంచి రూ. 25442కోట్లకు పెంచుకున్నారు. ఇందులో భూముల అమ్మకం ద్వారా రూ. 15500కోట్లను ప్రతిపాదించారు. కేంద్ర పన్నుల వాటా, ఇతర సాయాల్లో రూ. 59,396కోట్లను అంచనా వేసుకోగా ఈ సాయం అందే పరిస్థితి ఆశాజనకంగా లేదని సమాచారం.

తాజాగా ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలని చూస్తోంది. రెవెన్యూ ఖర్చులతో ఉండే ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి. ప్రణాళికేతర వ్యయాల్లో భారీగా ఉద్యోగులు వేతనాలు, ఫించన్లు, పీఆర్సీ పరిహారాలు వంటివి ఉన్నాయి. ప్రతీనెలా దాదాపు వివిధ మార్గాల్లో రూ. 10వేల కోట్ల రాబడి ఖజానాకు చేరుతుండగా ఖర్చు రూ. 12వేల కోట్లుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రూ. 2 వేల కోట్ల నిధులకు కష్టంగా ఉంటోంది. ఈ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేయడం ఆర్థికశాఖకు కష్టంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement