Saturday, November 23, 2024

ఇక పంజాబ్‌లో అభివృద్ధి శకం.. మేనిఫెస్టో హామీలన్నీ నెరవేరుస్తాం: కేజ్రీవాల్‌

ఆమ్‌ ఆద్మీపార్టీకి అఖండ విజయం అందించిన పంజాబీ ఓటర్లకు ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం పార్టీ విజయోత్సవ సంబరాల్లో భాగంగా అమృత్‌సర్‌లోని కచేరి చౌక్‌ నుంచి మెగా రోడ్‌షోనిర్వహించారు. ఈ ర్యాలీలో కేజ్రీవాల్‌తోపాటు పంజాబ్‌ నూతన సీఎం మాన్‌, ఆప్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి కేజ్రీవాల్‌ మాట్లాడుతూ, ఇకపై పంజాబ్‌లో అభివృద్ధి శకం మొదలవుతుందని భరోసాఇచ్చారు. ఎన్నికల సందర్భంగా పంజాబ్‌ ప్రజలు అద్భుతం చేశారని కొనియాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసి చూపిస్తామని చెప్పారు. కొన్ని హామీల అమలు ఆలస్యం కావొచ్చని, మొత్తానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు. సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ను కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆయన అత్యంత నిజాయితీ పరుడని కితాబునిచ్చారు.

పంజాబ్‌ను దోచుకోవడం అనే ప్రక్రియకు తమ ప్రభుత్వం పూర్తిగా అడ్డుకట్ట వేస్తుందని హామీ ఇచ్చారు. పంజాబ్‌లో ఆప్‌ విజయం పెద్ద విప్లవమని, రాష్ట్ర చరిత్రలోనే ప్రజలు ఓ నిజాయితీపరుడైన అభ్యర్థిని తమ సీఎంగా ఎన్నుకున్నారని కేజ్రీవాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఆప్‌ నేతలు, మంత్రులు ఎవ్వరైనా అవినీతికి పాల్పడితే జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ ”ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ప్రజల కోసం పని చేయాలి. అందుకే మేము మా భద్రతను 122 మందిని తగ్గించాం. 403 మంది పోలీసులను, 27 పోలీసు వాహనాలను వాళ్ల పోలీస్‌ స్టేషన్లకు పంపించాం. అలాగే ఏ ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫొటో ఉండదు. కేవలం షహీద్‌ భగత్‌సింగ్‌, బాబాసాహేబ్‌ అంబేద్కర్‌ ఫొటోలు మాత్రమే ఉంటాయి” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement