చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ ఉప వేరియంట్ బిఎఫ్.7 ప్రభావం భారతదేశంపై అంతగా ఉండదని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలెక్యులార్ బయాలజీ) డైరెక్టర్ నండికూరి వినయ్ తెలిపారు. ప్రస్తుతం చైనాలో ఉన్నంత తీవ్రత మనదగ్గర ఉండదని స్పష్టంచేశారు. ఇప్పటికే భారతీయుల్లో హెర్డ్ ఇమ్యూనిటీ ఉందని, అందువల్ల కొత్త వేరియంట్ ముప్పు తక్కువేనని చెప్పారు. అయినప్పటికీ, ఈ విధమైన కొత్త వేరియంట్లు ఆందోళన కరమే. కొన్నిసార్లు రోగ నిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యం ఈ వేరియంట్లకు ఉంటుంది.
వ్యాక్సిన్ తీసుకున్న వారిలోను, ఒమిక్రాన్ బారినపడిన వారిలోనూ బీఎఫ్7 వంటి వేరియంట్లు ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందుచేత పౌరులు ముందు జాగ్రత్తలు పాటించడం అవసరం. కొవిడ్ ప్రొటోకాల్స్ అనుసరించడం ద్వారా ప్రమాదాన్ని దూరంగా నెట్టివేయవచ్చు అని వినయ్ అభిప్రాయపడ్డారు.
దేశంలో బిఎఫ్.7 కేసులు నాలుగు నమోదైనట్లు వస్తున్న మీడియా కథనాలపై స్పందిస్తూ, మనం రెండవ తరంగంలోన భయంకరమైన డెల్టా వేవ్‌ను ఎదుర్కొన్నాం. ఆ తర్వాత వ్యాక్సిన్లు తీసుకున్నాం. ఆ తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ వచ్చింది. ప్రమాద ముప్పు ఉన్న వ్యక్తులు చాలా వరకు బూస్టర్ డోస్ టీకాను కూడా తీసుకున్నారు. అందుచేత చైనా పరిస్థితులకు మనకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు చైనా ఎదుర్కొంటున్న విపత్తు మన దరిదాపుల్లోకి కూడా రాదు అని సీసీఎంబీ డైరెక్టర్ విశ్వాసం వ్యక్తంచేశారు.
పొరుగు దేశంలో వైరస్ విజృంభణకు జీరో కొవిడ్ పాలసీ సడలింపు మాత్రమే కారణం కాదన్నారు. మన దేశంలో మాదిరిగా సామూహిక వ్యాక్సినేషన్ ప్రక్రియ అక్కడ జరగలేదని, తాజా పరిణామాలు దాని పర్యవసానమేనని చెప్పుకొచ్చారు. ఒకవేళ కొత్తవేరియంట్ మనదేశంలోకి వచ్చినా, ఎదుర్కొనే సామర్థ్యం ఆరోగ్య వ్యవస్థలకు ఉందన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్‌తోపాటు బూస్టర్ వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నందున ప్రమాదమేమీ లేదని నండికూరి వినయ్ అభిప్రాయపడ్డారు.