Thursday, November 21, 2024

Big Story | మొత్తం లెక్కలు తీస్తున్న విద్యాశాఖ.. ఖాళీలకు అనుగుణంగా పోస్టుల భర్తీకి చాన్స్‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విద్యాశాఖ మరోసారి ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించే పనిలో పడింది. జిల్లాల వారీగా ఖాళీల లెక్కలను తీస్తోంది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల విద్యాధికారులను అడిగి జిల్లాల్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలను విద్యాశాఖ సేకరిస్తోంది. ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు? ఎన్ని ఖాళీలున్నాయి? ఎంత మంది అవసరమనే? పాఠశాలలవారీగా విరాలను సేకరిస్తున్నారు. గతంలో ఉపాధ్యాయుల ఖాళీల వివరాలను విద్యాశాఖ సేకరించినప్పటికినీ మరోసారి మళ్లి పూర్తిస్థాయి వివరాలను సేకరిస్తోంది. ప్రతీ సంవత్సరం అకాడమిక్‌ ఇయర్‌కు ప్రారంభంలో ఉపాధ్యాయుల వివరాను సాధారణంగా అధికారులు సేకరిస్తారు.

చనిపోయిన వారి వివరాలు, రిటైర్డ్‌ అయిన వారి లెక్కలతోపాటు, అడ్మిషన్లు ముగిసిన తర్వాత టీచర్‌ ఖాళీల వివరాలను తీస్తారు. కానీ ఇప్పుడు తీస్తున్న ఖాళీల వివరాల అనుగుణంగానే పోస్టులను ఖరారు చేసి రిక్రూట్‌మెంట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ లేదా టీఆర్టీ నోటిఫికేషన్‌ వేయాలనే డిమాండ్‌ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఉన్నందున మరోసారి ఖాళీల వివరాలను తీస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. విద్యాశాఖ మాత్రం ఆమేరకు ఖాళీలు ఉన్నప్పటికీ 10 వేల మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుపుతోంది. ఖాళీలు మాత్రం 12 వేల వరకే ఉన్నట్లు ముందు నుంచీ చెబుతున్నారు.

- Advertisement -

విద్యాహక్కు చట్టం ప్రకారం 1:30 నిష్పత్తి ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కానీ ప్రస్తుతం 1:21 నిష్పత్తి ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 12 వేల నుంచి 13వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయని, వాటినే భర్తీ చేస్తామని ప్రభుత్వం అంటోంది. గతంలోనూ ఇవే ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. ఈక్రమంలోనే ఎక్కువ ఖాళీలను చూపించకుండా సర్దుబాటు చేసి అటు ఇటుగా 10వేల నుంచి 13 వేలలోపు ఖాళీలనే చూపించాలని విద్యాశాఖ భావిస్తున్నదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే జిల్లాల వారీగా ఎస్జీటీలు పోస్టులు ఎన్ని, ఎస్‌ఏ, పీఈటీ పోస్టులెన్ని, వాటిలోనూ సబ్జెక్ట్‌ టీచర్ల కొరత ఎంత ఉంది. ఖాళీల వివరాలన్నీ తేల్చి ఇంగ్లీష్‌ మీడియం ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేసేలా ఖాళీల వివరాలన్నీ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పాఠశాలలవారీగా, కేటగిరీల వారీగా క్యాడర్‌ స్ట్రెంగ్త్‌, ఖాళీలు, వర్కింగ్‌ వివరాలను డీఈఓలు సేకరిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 1.03 లక్షల మంది టీచర్లు పనిచేస్తుంటే, 22 వేల ఖాళీలున్నట్లు తెలిసింది. అయితే ఒక వేళ డీఎస్సీ లేదా టీఆర్టీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వేయదలిస్తే 10 వేల నుంచి 13 వేలలోపు పోస్టులను మాత్రమే భర్తీ చేసే వీలుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement