అమరావతి, ఆంధ్రప్రభ: గ్రీన్ ఫీ ల్డ్ హైవేల కల ఫలిస్తోంది. భారత మాల ప్రాజెక్టు ఫేజ్-1 కింద రాష్ట్రం మీదుగా ఐదు గ్రీన్ ఫీల్డ్ రహదారులకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటిలో ఒక్కో ప్రాజెక్టు క్రమేణా అమల్లోకి వస్తూ నిర్మాణ దశకు చేరుకుంటున్నాయి. సువిశాల సముద్ర తీర ప్రాంతం నుండి రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్త హైవేలను మంజూరుచేస్తూ వస్తోంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులకు భారీగా నిధులను కూడా కేటాయించింది. 2021లో భారతమాల ప్రాజెక్టు కింద రాష్ట్రానికి సంబంధించి ఐదు గ్రీన్ ఫీల్డ్ హైవేలను కేంద్రం మంజూరు చేసింది. వీటిలో విశాఖ-రాయపూర్, పశ్చిమ గోదావరి జిల్లా నుండి తెలంగాణను కలుపుతూ మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే విజయవాడ-నాగ్‌పూర్ హైవే, చిత్తూరు-తమిళనాడులోని తచ్చూరు వరకూ కలుపుతూ హైవేను మంజూరు చేసింది. ఈప్రాజెక్టులు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయి.
ముఖ్యంగా ఈ హైవేలు నిర్మాణం పూర్తయితే ఇతర రాష్ట్రాలకు రాష్ట్రం నుండి కనెక్టివిటీ పెరగడంతోపాటు సరుకు రవాణా సులువు, ప్రయాణ సమయం పూర్తిగా ఆదా కానుంది. దీనిలో భాగంగా ప్రస్తుతం విశాఖ- రాయపూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రాజె క్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 2,300 కోట్లు ఖర్చు చేస్తోంది. గత ఏడాది భూ సేకరణ ప్రక్రియను ముగించిన ఎన్‌హెచ్‌ఏఐ నిర్మాణ పనులను మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ హైవే పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ ఆరువరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు ఎన్‌హెచ్-130 సీడీగా నామకరణం చేశారు. భారత్‌మాల ప్రాజెక్టు ఫేజ్-1 కింద ఛత్తీస్‌ఘడ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మిస్తున్నారు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులతో మొత్తం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు రూ. 20 వేల కోట్లుగా ఎన్‌హెచ్‌ఏఐ అంచనాలను రూపొందించి టెండర్లను కూడా ఖరారుచేసింది.
మొత్తం 18 ప్యాకేజీలుగా పనులను విభజించింది. మొత్తం రహదారి నిర్మాణం 464 కీమీ ఉండగా రాష్ట్రంలో 100 కీమీ మేర ఈ హైవే ఉండనుంది. ఈ 100 కీమీ నిర్మాణానికి రూ.2,300 కోట్లను ఖర్చు చేయనున్నారు. విశాఖలోని సబ్బవరం నుండి పార్వతీపురం మన్యం జిల్లా ఆలూరు వరకూ పనులను ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతం సబ్బవరం వద్ద ఈ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు కల్వర్టుల నిర్మాణం, మరోవైపు రహదారి పనులను ఎన్‌హెచ్‌ఏఐ చకచకా చేస్తోంది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈహైవే నిర్మాణం పూర్తయితే దాదాపుగా గతంలో ఉన్న రహదారికన్నా 130 కీమీ ప్రయాణ భారం తగ్గడంతోపాటు దాదాపు 7 గంటల సమయం ఆదా అవుతుందని ఎన్‌హెచ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవేలతో అంతా ఆదా..
ప్రస్తుతం కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదముద్ర వేస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేలతో అంతా ఆదా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణ సమయంతోపాటు సరకు రవాణా దూరాభారం పూర్తిగా తగ్గనుంది. ఎక్స్‌ప్రెస్ హైవేల ప్రత్యేకతలను పరిశీలిస్తే నిడివైన రహదారులతోపాటు ప్రయాణ వేగం కూడా అధికంగా ఉంటుంది. గంటకు కనీసం 100 నుండి 120 కీమీ వాహనాలు ప్రయాణించే విధంగా మార్గాలు ఉంటాయి. అంతేకాకుండా రవాణ వ్యయం తగ్గడంతోపాటు స్టేట్ హైవేలు, పాత ఎన్‌హెచ్ హైవేలకు సంబంధం లేకుండా ఈ మార్గాలు ఉంటాయి. ముఖ్యంగా గ్రామాల రహదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్లై ఓవర్‌లతో ప్రయాణం ఉంటుంది. అలాగే అవుటర్ రింగ్ రోడ్ల తరహాలో ఎక్కడ పడితే అక్కడ వాహనాల నిలుపుదల ప్రవేశాలకు అనుమతులు ఉండవు.