విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరానికి తోడుగా నిలుస్తూ.. మెట్రో రైలు రెండో దశ పనులకు రేవంత్ సర్కారు త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించి ఆరు కారిడార్లుగా పనులను విభజించగా.. ఐదు కారిడార్లకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, మూడవ అతి పెద్ద మెట్రో నెట్వర్క్‌గా హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ అవతరిస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రైలు విజయవంతంగా నడుస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉండి ప్రపంచంలోనే ఏడేళ్ళు పూర్తి చేసుకున్న అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్‌గా అరుదైన ప్రతిష్టను సంపాదించుకుందని చెెప్పారు.
ముంబై, చెన్నైలో లక్షల కోట్లు ఖర్చు చేసి మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరిస్తున్నారని దురదృష్టవశాత్తు మన నగరంలో విస్తరణ లేని కారణంగానే మూడవ స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ రెండోదశ ప్రాజెక్టు విస్తరణపై సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు.
రెండో దశ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం అత్యంత ప్రధాన్యత ఇస్తోందని చెప్పారు. మొత్తం 57 స్టేషన్లతో ప్రపంచంలొనే పీపీపీ మోడ్‌లో అతిపెద్ద నెట్‌వర్క్‌తో రూ.22 వేల కోట్లతో అందుబాటులో ఉందన్నారు. హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్లూ విమానాశ్రయానికి కలిసేలా రెండో దశ ప్రాజెక్టులో ఐదు కారిడార్లకు డీపీఆర్ లు సిద్ధం చేసి పంపామని ఆయన అన్నారు.
మొత్తం రెండో దశలో 116.4 కిలోమీటర్ల పైగా మార్గాన్ని చేపట్టనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నియమం ప్రకారం 90 శాతం రైట్ ఆఫ్ వే ఉండాలన్న నియమం మేరకు అమలయ్యేలా ప్రాజెక్టు అనుమతులకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.