Friday, November 22, 2024

FallowUp: డేటింగ్‌ యాప్‌ మోజులో పడ్డ డాక్టర్‌, వల విసిరిన సైబర్‌ నేరగాళ్లు.. కోటిన్నర హాంఫట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డేటింగ్‌ పేరుతో అమాయకులను బుట్టలో వేసుకుని వేలకు వేలు కొల్లగొడుతున్నారు. అటువంటి వారి ఉచ్చులో తాజాగా ఓ వైద్యుడు పడ్డాడు. దాదాపు కోటిన్నర రూపాయలు సమర్పించుకున్నాడు. చేసేదేమీ లేక చివరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు డేటింగ్‌ యాప్‌ మోజులో పడి 2020లోనే ఓ డేటింగ్‌ యాప్‌కు బానిసయ్యాడు. అందులో హనీట్రాప్‌ చేసిన కొందరు డాక్టర్‌ నుంచి లక్షల కొద్ది డబ్బులు గుంజారు. కోరినప్పుడల్లా డాక్టర్‌ డబ్బును తన బ్యాంకు ఖాతా నుంచి బదిలీ చేసేవాడు. తర్వాత అవతలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అలా ఒకటి, రెండుసార్లు కాదు.. ఏకంగా మూడుసార్లు పోలీసుల వద్దకు వెళ్లాడు. వెళ్లినప్పుడల్లా వైద్యుడికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపడం, సైబర్‌ నేరగాళ్లను పట్టుకుంటామని హామీ ఇవ్వడం జరుగుతూనే ఉంది. అలా కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్న డాక్టర్‌ గతంలో తనపై వల విసిరిన నేరగాళ్లు మళ్లి తనకు మాయ మాటలు చెప్పి డబ్బులు గుంజినట్టు సమాచారం. చివరికి మరోసారి పోలీసులను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు.

మొత్తంగా గత రెండేళ్లలో రూ.కోటిన్నర పోగొట్టుకున్నట్టు ఆ డాక్టర్‌ పోలీసులకు చెప్పాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదరు వైద్యుడు కొన్నేళ్ల క్రితం ఓ డేటింగ్‌ యాప్‌లో అడుగు పెట్టాడు. అందులో ఉన్న ఫోన్‌ నెంబర్లకు ఫోన్‌ చేయగా అవతలి వైపు నుంచి ఓ అమ్మాయి తియ్యగా మాట్లాడింది. పక్కా ప్లాన్‌తో వైద్యుడిని ఉచ్చులోకి లాగింది. అతడి చాటింగ్‌ చేస్తూ రూ.41 లక్షలు కాజేసింది. తాను సైబర్‌ నేరగాళ్ల వలలో పడ్డానని ఆ వైద్యుడు అప్పట్లోనే పోలీసులను ఆశ్రయించి జరిగిన సంగతంతా చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డేటింగ్‌ యాప్‌కు బానిసగా మారిన డాక్టర్‌ రెండు నెలల తర్వాత మరోసారి అందులోకి అడుగు పెట్టాడు. చాటింగ్‌ వీడియోలో పాల్గొని దాదాపు రూ.31 లక్షలు పోగొట్టుకున్నాడు. దాచుకున్న మొత్తంతో పాటు అప్పులు చేసి మరీ డబ్బు సమర్పించుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మూడోసారి డాక్టర్‌కి సైబర్‌ నేరగాళ్ల నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో మరోసారి పలు దఫాల్లో రూ.80 లక్షలు సమర్పించుకున్నాడు. డేటింగ్‌ యాప్‌ మోజులో పడి ఈ డాక్టర్‌ ఏకంగా కోటిన్నర రూపాయలు పోగొట్టుకోవడంతో పోలీసులతో పాటు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. రెండుసార్లు మోసపోయిన మూడోసారి మళ్లి యాప్‌ జోలికి వెళ్లడం విస్మయానికి గురి చేస్తోంది. డాక్టర్‌ ప్రవర్తనను చూసి పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement