Monday, November 18, 2024

TS | వానాకాలం రైతుబంధు పంపిణీపై కసరత్తు షురూ.. 65లక్షల మందికి లబ్ధి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : యాసంగిలో అకాల వర్షాలు, వడగళ్ల వానలకు తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఈ ఏడాది ఖరీఫ్‌ రైతుబంధును ముందుగానే అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల చివరి వారం నుంచి 11విడత రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ముందుగా ఎకరంన్నర లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నిధులను జమచేయనున్నారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌కు రైతుబంధు నిధుల పంపిణీపై సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అటు ఆర్థికశాఖ, ఇటు వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ పెట్టుబడి కింద 11వ విడత రైతుబంధును ముందుగానే అందజేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

- Advertisement -

దాంతో గత యాసంగి ఈ ఖరీఫ్‌కు మధ్యన భూ క్రయ విక్రయాలు జరిగి, కొత్తగా పాసుపుస్తకాలు పొందిన రైతుల పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియను వ్యవసాయశాఖ ప్రారంభించింది. అన్ని జిల్లాల్లో కొత్త పాసుపుస్తకాలు పొందిన రైతుల పేర్ల నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఏటా ఖరీఫ్‌కు ముందు దాదాపు 4 లక్షల మంది రైతులు భూ క్రయవిక్రయాలు జరుగుతాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. వారి పేర్ల నమోదు మరో వారం రోజుల్లో పూర్తి కానుందన్నారు. కొత్త రైతుల పేర్లు పూర్తయిన వెంటనే రైతు బంధు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఎకరాకు రూ.5వేల చొప్పున ఖరీఫ్‌, యాసంగికి కలిపి ఏటా ప్రతి ఎకరాకు రూ.10వేలను రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు 10 విడతల్లో రైతు బంధు పంపిణీ పూర్తయింది.

ఇప్పుడు పంపిణీ చేయబోయే ఖరీఫ్‌-2023 రైతుబంధు 11వ విడతది. ప్రతీ విడత రైతు బంధు పంపిణీ కోసం రూ.7500కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రైతు బంధు పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 65లక్షల మంది రైతులు లబ్దిపొందుతున్నారు. రాష్ట్రంలోని కోటి 45లక్షల ఎకరాలకు రైతు బంధు పంపిణీ అవుతోంది. ఈ 11వ విడత రైతు బంధు పంపిణీ కోసం రూ.7500 కోట్లను సమీకరించాలని ఆర్థికశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

అన్ని జిల్లాల నుంచి సర్వే నంబర్ల వారీగా రైతుల తాజా సమాచారాన్ని తీసుకుని ఎక్కడా జాప్యం లేకుండా రైతుబంధు పథకం కింద నగదును రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆర్థికశాఖ అధికారులకు ఇప్పటికే సూచించారు. ప్రతీ ఖరీఫ్‌, రబీ సీజన్‌ ప్రారంభానికి ముందు రైతుబందు డేటా అప్‌డేట్‌ చేస్తారు. పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూ యజమానులు తమ భూములను విక్రయిస్తున్నారు. దీంతో ప్రతీ సీజన్‌లోనూ లబ్దిదారుల తొలగింపు, చేరికలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో సర్వే నంబర్ల ఆధారంగా రైతుబంధు నిధులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement