Saturday, November 23, 2024

టీచర్లు లేకుండా చదువు చెప్పేదెలా? విద్యావలంటీర్ల కొనసాగింపుపై స్పష్టత లేని విద్యాశాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్యావాలంటీర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వారిని విద్యాశాఖ పక్కనబెట్టి దాదాపు 27 నెలలు కావొస్తోంది. 2020 కోవిడ్‌ సమయంలో వారిని విధుల్లోంచి తీసేసిన విద్యాశాఖ.. ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంకా వారిని విధుల్లోకి తీసుకోకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెన్యూవల్‌ కోసం రెండేళ్లకుపైగా వారు ఎదురు చూస్తున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని మంత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వ బడుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభించడంతో సర్కారు బడుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. విద్యార్థల సంఖ్యకు అనుగుణంగా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సింది పోయి ఉన్న అరకొర సిబ్బందితోటే విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. విద్యావాలంటీర్లను తీసుకోవాలనే డిమాండ్‌ ఉపాధ్యాయ సంఘాల నుంచి సైతం వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు కొత్తగా టీచర్లను రిక్రూట్‌ చేసే పరిస్థితి లేదు కాబట్టి అంత వరకూ విద్యా వాలంటీర్లను రెన్యూవల్‌ చేసి విధుల్లోకి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తద్వారా విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించే వీలుందని అంటున్నాయి.

సర్కారు బడుల్లో వేల సంఖ్యలో టీచర్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. టీచర్ల సర్దుబాటు తర్వాత మిగిలే పోస్టుల్లో విద్యావాలంటీర్లను తీసుకుంటామని గతంలో అధికారులు చెప్పినా.. ఆ దిశగా ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. 2019-20 విద్యాసంవత్సరంలో టీచర్ల ఖాళీలను బట్టి ప్రభుత్వం 16వేల మంది విద్యావాలంటీర్లను మొదటి సారిగా తీసుకుంది. ఆ 16వేల మందిలో కొందరికి ఉద్యోగాలు రావడం, కొంత మంది ఈ ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లడంతో చివరకు 10వేల మంది వరకు మిగిలారు. కానీ 2020లో కరోనా కారణంగా మార్చి నెలాఖరు నుంచి విద్యావాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. ఇలా రెండేళ్లు గడిచిపోయింది. ఈ విద్యా సంవత్సరంలోనైనా వీరిని విధుల్లోకి తీసుకుంటారో..లేదో అనే అంశంపై స్పష్టత ఇవ్వడంలేదు. మరోవైపు తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మంత్రులకు, ప్రజాప్రతినిధులకు విద్యావాలంటీర్లు గత రెండేళ్లుగా వినతిపత్రాలు సమర్పిస్తునే ఉన్నా కనికరించడంలేదని ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లుగా ఉన్నట్లు సమాచారం.

నాణ్యమైన విద్య ఏదీ?..

రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ, లోక్‌బాడి పాఠశాలలు ఉంటే అందులో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దాదాపు 20 లక్షల మంది వరకు ఉన్నారు. ఉపాధ్యాయులు 1.06 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు దాదాపు 21,500 వరకు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలయ్యే ఇంగ్లీష్‌ మీడియం బోధనను బోధించాలంటే అదనంగా మరో 10వేల మంది వరకు టీచర్లు అవసరం ఉంటుంది. విధుల్లోంచి తీసేసిన 10వేల విద్యావాలంటీర్లను తీసుకోకుండా ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం సాధ్యమయ్యే పనికాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. ఉన్న టీచర్లతోనే తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో బోధనను చెప్పించడం కుదరదు. ఈనేపథ్యంలో టీచర్లు లేని పాఠశాలలకు విద్యావాలంటీర్లను నియమించాలనే డిమాండ్‌ ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement