న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై పూర్తిస్థాయి ప్రతిపాదనేదీ ప్రస్తుతం తమ వద్ద పెండింగ్లో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘువాల్ శుక్రవారం రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. హైకోర్టు తరలింపు గురించి రాష్ర్ట్ట ప్రభుత్వం, అక్కడి హైకోర్టు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. అందుకు సంబందించిన పూర్తి స్థాయి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని ఆయన జవాబులో పేర్కొన్నారు.
2014 విభజన చట్టం ప్రకారం అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు ఏర్పాటై 2019 జనవరి 1 నుంచి పనిచేస్తోందని వెల్లడించారు. 2020లో ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్ తరలించేందుకు ఏపీ ముఖ్యమంత్రి ప్రతిపాదించారని కేంద్రమంత్రి తెలిపారు. రాష్ర్ట హైకోర్టును సంప్రదించి తరలింపు నిర్ణయం రాష్ర్ట ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు.