ఉమ్మడి కరీంనగర్, (ప్రభన్యూస్ బ్యూరో) : గత నాలుగు రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలం అయ్యింది. ఇద్దరు మృత్యువాత పడగా, 100 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల కుండపోత వర్షానికి 15 చెరువులకు గండ్లు పడ్డాయి. వరద ఉధృతికి సుమారు 42 కల్వర్టులు కొట్టుకుపోయాయి. 50 వరకు పంచాయతీరాజ్ రోడ్డులు కోతకు గురయ్యాయి. సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పంట పొలాల్లో ఇసుక మేట వేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ ఆరంభంలో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఉమ్మడి జల్లా వ్యాప్తంగా వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల ద్వారా తెలుస్తోంది.
- కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్ అండ్ బీ రోడ్లు 33 మార్గాల్లో దెబ్బతిన్నాయి. నష్టం అంచనా 3 కోట్ల రూపాయలు ఉంటుందని గుర్తించారు. పంచాయతీరాజ్‌కు సంబంధించిన 125 రోడ్లు దెబ్బతిన్నాయి. కరీంనగర్ జిల్లాలో వంద ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది.
- జగిత్యాల జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి 68 మార్గాల్లో దెబ్బతినగా మరమ్మతులకోసం 3.60 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనావేశారు. నీటిపారుదలకు సంబంధించి 25 చోట్ల వంతెనలు దెబ్బతిన్నాయి. 94 ఇళ్లు పాక్షికంగా, ఒక ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.
- పెద్దపల్లి జిల్లాలో సుమారు 3 వేల మంది రైతులకు సంబంధించి వరి 5వేల ఎకరాల్లో, 410 మంది రైతులకు సంబంధించి పత్తి 850 ఎకరాల్లో దెబ్బతిన్నది. జిల్లాలో 27 రోడ్లు దెబ్బతిన్నాయి. దీనికి తోడు మానేరు నదిలో చాలా వరకు కరెంట్ మోటార్లు కొట్టుకుపోయాయి.
- రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 41 రోడ్లు దెబ్బతిన్నాయి. పది వేల ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలో తేలింది. పదివేల ఎకరాల్లో వరి, 1900 ఎకరాల్లో పత్తిపంట దెబ్బతిన్నది. ఇసుక మేటలతో నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.