Saturday, November 23, 2024

ఆఫ్రికాలో ఆకలి కేకలు.. ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావమే కార‌ణం

న్యూఢిల్లి:ఆఫ్రికాలోని చాలా దేశాలు ఆకలితో అలమటిస్తున్నాయి. వాతావరణ సమతుల్యత దెబ్బతినడం, కోవిడ్‌ ప్రభావం వల్ల ఇప్పటికే చాలా దేశాల్లో ఆర్థిక కష్టాలకు తోడు దుర్భిక్షం తాండవిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర అశనిపాతంగా మారింది. రష్యా, ఉక్రెయిన్‌ నుంచి ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల దిగుమతి నిలిచిపోవడంతో ఆ రెండు దేశాలపై ఆధారపడిన ఆఫ్రికా దేశాలు ఇప్పుడు ఆకలి కేకలు పెడుతున్నాయి. మార్చినుంచి మొదలైన కష్టాలు ఇప్పుడు తారా స్థాయికి చేరాయి. పేదరికం, అసమానత, అవిద్య వంటి సామాజిక సమస్యలకు తోడు ఇప్పుడు ఆహార సంక్షోభం వారిని కబళిస్తోంది. ఆఫ్రికా ఖండంలోని 1.74 కోట్ల పేదలు ఇప్పుడు ఆహారం లేక అలమటిస్తున్నారు. ఆహారభద్రత లేకపోవడం, ఆహార కొరత తీవ్ర స్థాయికి చేరింది. ఆహార ధాన్యాల కొందామన్నా దొరకడం లేదు. ఒకవేళ ఉన్న చాలామంది పేదలకు కొనుగోలు శక్తి లేదు. గడచిన రెండు నెలల్లో ఆహార పదార్థాల ధరలు 12.6 శాతం పెరిగాయి. బ్రెడ్‌ వంటి పదార్థాల ధరలు ఏకంగా 50 శాతంనుంచి రెట్టింపు అయ్యాయి. 1990 తరువాత మళ్లి ఇప్పుడే ధరల పెరుగుదల తారాస్థాయిలో ఉండటం గమనార్హం.

ప్రమాదకర పరిణామాలు..

దక్షిణాఫ్రిక, తూర్పు, పశ్ఛిమ ఆఫ్రికా దేశాల్లో ఆహార సంక్షోభం తీవ్రం కానుందని, ఆకలితో అలమటించేవారి సంఖ్య పెరగనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా 17 శాతం మేర ఆకలిదప్పులు పెరుగుతాయన్న ఆ సంస్థ ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో ఆహార సంక్షోభం 20.8 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. మొత్తం మీద ఆఫ్రికాలో 1.74 కోట్ల మంది ఆకలితో అలమటించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని హెచ్చరించింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌, రష్యాల నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడనున్న ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు జి-7 దేశాలు 4.5 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని కేటాయించినట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.

రష్యా-ఉక్రెయిన్‌ ప్రభావం..

ప్రపంచ దేశాల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అవసరాల్లో 75 శాతం మేర, గోధమ అవసరాల్లో 30 శాతం రష్యా, ఉక్రెయిన్‌ దేశాలే సరఫరా చేస్తున్నాయి. బార్లీ, మొక్కజొన్న, వంటనూనెలు, ఎరువుల ఉత్పత్తి, ఎగుమతుల్లో టాప్‌ 5 దేశాల్లో ఈ రెండు ఉన్నాయి. ఎరువుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే రష్యా అగ్రస్థానంలో ఉంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించింది. ఆ తరువాత ఆ రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్‌ పోర్టుల్లో లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, వంటనూనెలను రవాణా చేసే నౌకలు నిలిచిపోయాయి. నల్లసముద్రం మీదుగా వాటి రవాణాను రష్యా అనుమతించడం లేదు. మరోవైపు రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడంతో అక్కడి నుంచి ఇతర దేశాలకు రవాణా నిలిచిపోయింది. దరిమిలా ఆయా దేశాలనుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే ఆఫ్రికా దేశాల్లో ఆహార సంక్షోభం తలెత్తుతోంది. ఎరువుల రవాణా నిలిచిపోవడం వల్ల ఆఫ్రికాలో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడబోతోంది. ఒక నివేదిక ప్రకారం తూర్పు ఆఫ్రికా దేశాలకు ఏటా రవాణా గోధుమల్లో 90 శాతం మేర ఈసారి నిలిచిపోయింది. ఇథియోపియా, కెన్యా, సొమాలియాలో ఆహార కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తక్కువ ఆదాయం ఉన్న ఆ దేశాలు అధిక ధరలకు దిగుమతులు చేసుకునే స్థితిలో లేవు. ఇక ప్రపంచంలో గోధుమ దిగుమతుల్లో నాలుగో స్థానంలో ఉన్న నైజిరియా ఇన్నాళ్లూ రష్యా, ఉక్రెయిన్‌పైనే ఆధారపడింది. ఇప్పుడు అక్కడి నుంచి సరఫరాలు లేకపోవడంతో ఆకలికేకలు పెడుతోంది. అలాగే, టాంజానియా, సూడాన్‌, ఉగాండా, కామెరూన్‌ వంటి దేశాలు కూడా ఆ రెండు దేశాల ఆహార ధాన్యాలపైనే ఆధారపడ్డాయి. దిగుమతులు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. యుద్ధం ప్రారంభం కాకముందు ఉక్రెయిన్‌లోని మారియపోల్‌, ఒడెశా పోర్టుల నుంచి ఆఫ్రికా దేశాలకు ఆహార ధాన్యాలు రవాణా అయ్యేవి. మరియపోల్‌ రష్యా చేతుల్లోకి వెళ్లిపోగా, ఒడెశాపై రష్యా క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌ పోర్టుల్లో దాదాపు 2.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పేరుకుపోయాయి.

- Advertisement -

మరికొన్ని రోజులు అలాగే ఉండిపోతే అవి పాడైపోతాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా మరికొన్ని నెలల్లో పంటల కోతలు పూర్తయి మరో 5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుమతి వచ్చి పడుతుంది. రష్యా వీటిని ధ్వంసం చేయకుండా ఉంటే, వీలైనంత వేగంగా బాధిత దేశాలకు తరలించగలిగితే కొంతలో కొంత మేలు జరుగుతుంది. సరుకు రవాణా నౌకలను రష్యా అడ్డుకోరాదని, ఆయా నౌకలకు పశ్చిమ దేశాలు యుద్ధ నౌకలతో వాటికి రక్షణ కల్పిస్తే రవాణా సజావుగా సాగుతుందని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేస్తోంది. కాగా ఉక్రెయిన్‌ పోర్టుల్లో నిలిచిపోయిన నౌకలను కదలనివ్వడానికి రష్యాను ఒప్పించే ప్రయత్నంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ అంటోనియా గుటెర్రస్‌ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రపంచ దేశాలకు ఎరువులు ఎగుమతి చేసేలా ఆంక్షలను సడలించాలని రష్యా షరతు పెడుతోంది. కాగా పశ్చిమ ఆఫ్రికా దేశాలైన లిబియా, సూడాన్‌, ఇథియోపికా, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, కామెరూన్‌ వంటి దేశాల్లో ఆహార సంక్షోభం భయంకరంగా ఉంది. దీనికి తోడు ఇథియోపియా వంటి దేశాల్లో అంతర్గత కలహాలు సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. 2000 సంవత్సరంలో పేదరికం తీవ్రస్థాయికి చేరుకుంది. అది ప్రజల్లో అసహనానికి దారితీసింది.2021లో కెన్యా సహా పలు దేశాల్లో ప్రజలు రోడ్డెక్కారు. ధరల పెరుగుదులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. కాగా ఉక్రెయిన్‌ నుంచి 60 శాతం మేర గోధుమల దిగుమతిని తగ్గించడంతో కామెరూన్‌లో ఆహార సంక్షోభం నెలకొంది. కాగా ఆఫ్రికా దేశాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు జి-7 భారీగా నిధులు కేటాయించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ 2.76 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని కేటాయించారు. ఈ మొత్తాన్ని పౌష్టికాహారం, ఆహార ధాన్యాల సరఫరాకు కేటాయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement