కరోనా వైరస్ దెబ్బకు దేశం ఆర్థికంగా చాలా నష్టపోయింది. మొదటి వేవ్ సమయంలో రెండు నెలలు లాక్‌డౌన్ పెట్టడంతో ఆదాయాలకు భారీగా గండి పడింది. చాలా రాష్ట్రాల పరిస్థితి ఇలాగే ఉండటంతో కేంద్రానికి పెద్ద మొత్తంలో రావాల్సిన ఆదాయం రాలేదు. దీంతో కేంద్రం అప్పుల వైపు మొగ్గు చూపుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అప్పులు చేస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా కేంద్రం రూ.2.1 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. బడ్జెట్ లోటుగా ఉండటంతో అప్పులు తేవాల్సి వచ్చింది. గతేడాది ఇదే సమయంలో తెచ్చిన అప్పుతో పోలిస్తే ఇది 55 శాతం ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ అప్పు ఈ ఏడాదికి బడ్జెట్‌లో అనుమతించిన రూ.12.05 లక్షల కోట్లలో 17.5 శాతం మాత్రమే అని తెలుస్తోంది. ఈ ఏడాది సగానికి చేయాల్సిన 30 శాతం అప్పుకు ఇది సమానమని నిపుణులు వివరిస్తున్నారు.