Friday, November 22, 2024

BRS | దేశం అతిపెద్ద ప్రమాదంలో పడింది, బీజేపి ముక్త్‌ పోరాటం చేద్దాం.. బీఆర్‌ఎస్ స‌భ‌లో సీపీఐ నేత డి.రాజా

స్వాతంత్య్ర పోరాటం తరహాలోనే మరోసారి దేశప్రజలంతా ఏకమై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను దేశంనుంచి తరిమికొట్టాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత దేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందని, దేశానికే బీజేపీ ప్రమాదకారిగా మారిందని ఆయన విమర్శించారు. ఉద్వేగభరితంగా ప్రసంగించిన ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఖమ్మం వేదికగా ఇవ్వాల జ‌రిగిన‌ బీఆర్‌ఎస్‌ జాతీయ భేరి బహిరంగసభలో సీపీఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డి. రాజా ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై ప్రశంసలు కురిపించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశాన్ని అతిపెద్ద ప్రమాదంలో నెట్టాయని ఆరోపించారు. సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీస్తూ నియంతృత్వ ధోరణిలో దేశాన్ని పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరంతర విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే గనత వహించిందని, రానున్న రోజుల్లో కేసీఆర్‌ మరిన్ని పథకాలు తేవాలని ఆకాంక్షించారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకున్న ఆయన రావినారాయణరెడ్డి, గిరిప్రసాద్‌, మగ్దూం పేర్లను తలుచుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులర్పించారు. తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందుతోందని ప్రస్తుతించారు. విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిల్చిందని, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు సమాఖ్య స్పూర్తిని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. దేశంలో లౌకిక తత్వం ప్రమాదంలో పడిందన్నారు.

- Advertisement -

భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చే ప్రమాదం జరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. విద్య, ఆరోగ్య, ఉద్యోగ, ఉపాధి రంగాలను కేంద్రం విస్మరించిందన్నారు. మోదీ సబ్‌కాసాథ్‌-సబ్‌ కా వికాస్‌ అని నినదించి అదానీ, అంబానీ, టాటా, బిర్లాలకు సాథ్‌గా నిల్చారని మండిపడ్డారు. కార్పొరేట్‌ శక్తులకు మోడీ కొమ్ముకాస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో గవర్నర్ల వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో గవర్నర్లు హద్దులు మీరుతున్నారని ఆరోపించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా పోరాటం కొనాగాలని పిలుపునిచ్చారు. బీజేపీపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలన్నారు.

బీజేపీని ఓడించడమే అందిరిముందున్న కర్తవ్యమని చెప్పారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశాన్ని విచ్ఛిన్నం చేయలేవని పేర్కొన్నారు. భారత దేశం హిందూ దేశంగా మారితే ప్రమాదకరమని రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆనాడే హెచ్చరించారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు బీజేపీ పాలనలో ఉత్పన్నమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు దేశ మౌలిక వ్యవస్థలనే మార్చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సాబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ అని నినాదాలు చేసిన మోడీ ఇప్పుడు ఎవరితో ఉన్నాడు..? అని నిలదీశారు. మోడీ పేదవాళ్లను వదిలేసి కార్పొరేట్లతో అంటకాగుతున్నారని ధ్వజమెత్తారు.

గవర్నర్లు సీఎంలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఫెడరల్‌ స్పూర్తి అంటే ఇదేనా అని నిలదీశారు. వన్‌ నేషన్‌ వన్‌ లీడర్‌ వన్‌ పార్టీ అనే రీతిలో బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. బీజేపీతో దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందన్నారు. బీజేపీ దేశానికి ప్రమాదకారిగా పరిణమించిందని హెచ్చరించారు. దేశం ఉనికి ప్రమాదంలో పడినప్పుడు సెక్యులర్‌ పార్టీలు ఏకం కావాలి…బీజేపీ పాలనుంచి దేశానికి విముక్తి కల్గించాలి. ఖమ్మం సభనుంచి దేశానికి ఈ మెసేజ్‌ ప్రపంచానికి పంపాలి అని డి రాజా పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement