Wednesday, November 20, 2024

TS | కౌంట్‌డౌన్‌ షురూ.. రాష్ట్రంలో హోరెత్తిన ప్రచారం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ప్రచారానికి గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. కేంద్రంలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యూహప్రతివ్యూహాలతో దూసుకెళ్తుండగా.. ఎలాగైనా ఉనికి చాటుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో బహిరంగసభలు, రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లు, ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలతో.. లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరెత్తింది.

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల ప్రకటన కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచార పర్వం మరింత ఉద్ధృతంగా సాగింది. అధికార కాంగ్రెస్‌తో పాటు- ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్‌, బీజేపీ విస్తృతంగా పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. మజ్లిస్‌, బీఎస్పీ, వామపక్షాలు సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి.

ఆయా పార్టీల తరపున అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌ షోలలో పాల్గొన్నారు. తమ పార్టీ విధానాలను వివరిస్తూ, వైరి పక్షాల వైఖరిని ఎండగడుతూ ప్రచారాన్ని వేడెక్కించారు. విమర్శలు, ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారం కదనరంగాన్ని తలపించింది. ఆయా పార్టీల తరపున ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గత కొన్నాళ్లుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది.

పోలింగ్‌కు 48గంటల ముందు సైలెన్స్‌ పీరియడ్‌ పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ప్రారంభం కానుంది. రేపుసాయంత్రం నాలుగు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. 13 నియోజకవర్గాలలో గంట ముందుగానే పోలింగ్‌ ముగించనున్నారు. సైలెన్స్‌ పీరియడ్‌ ప్రారంభంతో ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌ షోలు, నిర్వహించరాదు.

రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లోకి రానుంది. అభ్యర్థులు, వారి తరపున మద్దతుదారులు కేవలం ఇంటింటి ప్రచారం మాత్రమే చేసుకోవచ్చు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు సహా ఇతరత్రా చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తారు.

- Advertisement -

ప్రలోభాల కట్టడిపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడంతోపాటు నిఘా మరింత పటిష్ఠం చేస్తారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేస్తారు. మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను శనివారం సాయంత్రం నుంచి మూసివేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement